ఫిరాయింపు ఎమ్మెల్యేలపై తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా ఆలోచించాల్సిందే. రాజకీయాల్లో నీతి నిజాయితీ ఉండాలి అనుకున్న వాళ్ళు ఎవరు కూడా ఇలాంటి తీర్పులను ఊహించి ఉండరేమో. ఎందుకంటే ఇక్కడ ఏ పార్టీకి ఆపాదించకుండా రాజకీయాల్లో నిలువెత్తు నిజాయితీ ఉండాలనేది రాజ్యాంగ ఉద్దేశం. కానీ బిఆర్ఎస్ నుంచి గెలిచిన తెల్లం వెంకటరావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, అరికపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ లో చేరుతున్నట్టు ఓపెన్ గానే చెప్పారు. కాంగ్రెస్ కండువా కూడా కప్పుకున్నారు. కానీ గులాబీ పార్టీ నేతలు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసేసరికి మాట మార్చేశారు. ఇప్పుడు స్పీకర్ వాళ్లు కాంగ్రెస్ లో చేరుతున్నట్టు ఎలాంటి ఆధారాలు లేవు కాబట్టి అనర్హత పిటిషన్ ను కొట్టేశారు.
వాళ్లు ఎందుకు మాట మార్చారో అందరికీ తెలిసిందే. నిజంగానే కాంగ్రెస్ లో చేరినట్టు ఒప్పుకుంటే అనర్హత వేటు పడుతుందేమో.. ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళీ గెలుస్తామో లేదో అనే అనుమానంతోనే వాళ్ళు ఒప్పుకోకపోయి ఉండొచ్చు. కానీ ఇక్కడ కళ్ళ ముందు కనిపించిన వాటిని కూడా సాక్షాలుగా పరిగణించకపోవడం ఒకంత బాధాకరం. ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ చేసింది మాత్రమే కాదు గతంలో గులాబీ పార్టీ కూడా ఇదే తప్పు చేసింది. 2014లో గెలిచిన తర్వాత కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను, టిడిపి ఎమ్మెల్యేలను, చివరకు సిపిఐ ఎమ్మెల్యేను కూడా తన పార్టీలో చేర్చుకున్నారు. 2018లో గెలిచిన తర్వాత కూడా 12 మంది ఎమ్మెల్యేలను చేర్చుకోవడం సంచలనం అయిపోయింది. అప్పుడు స్పీకర్ గా ఉన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి సరైన నిర్ణయం తీసుకోవట్లేదని కాంగ్రెస్ విమర్శించింది.
కానీ ఇప్పుడు అదే శ్రీనివాస్ రెడ్డిని కాంగ్రెస్ లో చేర్చుకున్నారు. కెసిఆర్ అప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను భారీ స్థాయిలో చేర్చుకొని.. ఇప్పుడు ఆ పని తప్పు అనడం వల్ల వాళ్లు చేసింది కూడా తప్పు అన్నట్టే కదా. గతంలో సీనియర్ ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు కాంగ్రెస్ నుంచి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు వస్తామంటే రాజీనామా చేసి రమ్మన్నారు. వాళ్లు రాజీనామా చేయలేమంటే వద్దన్నారు. రాజకీయాల్లో అలాంటి నిజాయితీ ఉండాలి. అప్పుడే భవిష్యత్తు తరాలలో రాజకీయాల్లో మార్పు వస్తుంది.