Telangana: దసరా వేళ 10 రోజుల్లో రూ. 1000 కోట్ల మద్యం తాగేశారు
ఖజానాకు భారీ ఆదాయం;
తెలంగాణలో మద్యం అమ్మకాలు మరోసారి రికార్డు స్థాయిలో జరిగాయి. దసరా పండుగ నేపథ్యంలో రాష్ట్రంలో మద్యం ఏరులై పాలింది. పండుగ పది రోజుల్లో రాష్ట్రంలో దాదాపుగా వెయ్యి కోట్ల మేర మద్యం విక్రయాలు జరిగాయి. బార్లు, మద్యం దుకాణాలతో పాటుగా పబ్ లలోనూ భారీగా అమ్మకాలు పెరిగాయి. దీంతో ఖజానాకు మద్యం భారీగా ఆదాయం తెచ్చి పెట్టింది. హైదరాబాద్ నగరంలోనే భారీగా అమ్మకాలు జరిగినట్లు అధికారులు తేల్చారు. రాష్ట్రంలో 2,260మద్యం దుకాణాలు, 1,171బార్, రెస్టారెంట్లు ఉన్నాయి. వీటితో పాటుగా పబ్ ల లోనూ మద్యం అమ్మకాలు కొనసాగుతున్నాయి. ప్రతీ ఏటా దసరా వేళ తెలంగాణలో మద్యం అమ్మకాలు భారీగా ఉంటాయి. ఈ సారి అదే అంచనాతో ముందుగానే ఎక్సైజ్ శాఖ భారీగా మద్యం నిల్వలను సిద్దం చేసింది. అదే విధంగా ఆర్డర్లు వచ్చాయి. బార్లు, మద్యం దుకాణాలు భారీగా స్టాక్ ను మెయిన్ టెయిన్ చేసాయి. దసరా ప్రారంభానికి ముందు నుంచే అమ్మకాల కిక్కు మొదలైంది. 2024సెప్టెంబర్ 30వరకు 2,838.92కోట్ల అమ్మకాలు జరిగాయి.
వెయ్యి కోట్ల అమ్మకాలు
అక్టోబర్ నెల ప్రారంభం నుంచి 11వతేదీ వరకు రూ 1,057.42 కోట్ల మేర విలువైన 10.44 లక్షల కేసుల లిక్కర్ విక్రయాలు జరిగినట్లు లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. అదే విధంగా 17.59 లక్షల బీర్ల కేసులు అమ్మకాలు జరిగాయి. అమ్మకాల్లో రంగారెడ్డి జిల్లా ముందుండగా, కరీంనగర్, నల్లగొండ, వరంగల్ జిల్లాలు ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. పండగ చివరి మూడు రోజులు అంతకు మించి అన్నట్లుగా అమ్మకాలు జరిగాయి. ఎక్సైజ్ డిపోల నుంచి రూ 205.42 కోట్ల మేర విలువైన మద్యం రిటైల్ దుకాణాలకు చేరింది. అందులో లిక్కర్, బీర్ల అమ్మకాలు పోటీ పడ్డాయి.