Telangana Weather : ఓవైపు వర్షం.. మరోవైపు మండుతున్న ఎండలు..
Telangana Weather : ఎండలు మండిపోతున్న వేళ వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. వచ్చే 24 గంటల్లో అండమాన్ నికోబార్ దీవులను రుతుపవనాలు తాకుతాయని చెప్పింది.;
Telangana Weather : ఎండలు మండిపోతున్న వేళ వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. వచ్చే 24 గంటల్లో అండమాన్ నికోబార్ దీవులను రుతుపవనాలు తాకుతాయని చెప్పింది. ఆ తర్వాత బంగాళాఖాతం, హిందూ మహాసముద్రంలో విస్తరించి ఈ నెలాఖరులోగా కేరళను తాకుతాయని తెలిపింది. జూన్ 8లోగా నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశిస్తాయని వివరించింది. తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర వాతావరణం కనిపిస్తోంది. నాలుగు చినుకులు పడి చల్లబడిందని అనుకునే లోపే.. మరుసటి రోజు ఎండలు దంచికొడుతున్నాయి. మరో 20 రోజుల్లో ఎండలు తగ్గిపోతాయని, వాతావరణం చల్లబడుతుందని వాతావరణ శాఖ తెలిపింది.
గడిచిన 24 గంటల్లో తెలంగాణలోని 16 జిల్లాల్లో వర్షం పడిందని TSDPS తెలిపింది. సిద్దిపేట జిల్లా రాంపూర్‌లో అత్యధికంగా 5.6 సెంటీమీటర్లు, రంగారెడ్డి జిల్లా పొద్దటూర్‌లో 5.45, రాజన్న సిరిసిల్ల జిల్లా గజసింగారంలో 4.40, సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో 3.93, రుద్రారంలో 3.80 సెంటీమీటర్ల వర్షం కురిసినట్టు తెలిపింది. ఇవాళ సిద్దిపేట, మహబూబ్‌నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, రంగారెడ్డి, నాగర్‌కర్నూల్, ములుగు, నారాయణపేట, వికారాబాద్ జిల్లాల్లో పలుచోట్ల గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
మరోవైపు నిన్న తెలంగాణ వ్యాప్తంగా ఎండలు మండిపోయాయి. హైదరాబాద్ తప్ప అన్ని జిల్లాల్లో 40 డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా జైనథ్‌లో అత్యధికంగా 45.2 డిగ్రీలు, చప్రాలలో 44.9, నిర్మల్ జిల్లా తానూరులో 44.8, కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కెరమెరిలో 44.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్‌లో 45 డిగ్రీల పైన, నిర్మల్, కుమ్రంభీం, పెద్దపల్లి జిల్లాల్లో 44 డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇవాళ అదనంగా మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం వెల్లడించింది.