Telangana Temperature: తెలంగాణలో దంచికొడుతున్న ఎండలు..

40 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు

Update: 2024-03-02 05:00 GMT

తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు పెరిగిపోతున్నాయి. 40 డిగ్రీల చేరువకు ఉష్ణోగ్రతలు చేరుతున్నాయి. మరోవైపు ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని ఐఎండీ అంచనా వేసింది. మార్చి రెండో వారంలో ఒక వైపు అధిక ఉష్ణోగ్ర‌త‌లు, మ‌రో వైపు తేలిక‌పాటి నుంచి మోస్త‌రు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ కేంద్రం వెల్ల‌డించింది.

తెలంగాణలో ఎండ కాలం కొంచెం ముందే మొదలైంది. ఎండలు దంచి కొడుతున్నాయి. ఉదయం, రాత్రి సమయాల్లో చల్లగాలులు వీస్తున్నా.. పగటి పూట మాత్రం భానుడు భగ భగా మండిపోతున్నాడు. మధ్యాహ్నం సమయంలో బయటికెళ్తే.. చెమటలు కక్కిస్తున్నాడు. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగిపోతున్నాయి. కాగా.. బుధవారం నుంచి ఎండల తీవ్రత మరింత పెరిగిపోనుందని.. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీంతో రేప‌టి నుంచి ఎండ‌లు మ‌రింత దంచికొట్టే అవ‌కాశం ఉందని అధికారులు చెప్తున్నారు.

సాధార‌ణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీల మేర ఉష్ణోగ్రలు పెర‌గ‌నున్ననట్టు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ నగరంలోనూ ఎండలు దంచి కొడుతున్నాయి. 38 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటం నగరవాసులను భయపెడుతోంది. అయితే.. వేసవి కాలం పూర్తిగా ప్రారంభం కాకముందే.. ఇంతగా ఉష్ణోగ్రతలు పెరుగుతుండటం చూస్తుంటే.. ఇక రాను రాను పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇకపై కూడా రాష్ట్రంలోని పలు జిల్లాలతో పాటు హైదరాబాద్‌ నగరంలోనూ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని మెట్రోలాజికల్ డిపార్ట్ మెంట్ వెల్లడించింది. ఈసారి రాష్ట్రంలో ఎండల తీవ్రత గట్టిగా ఉండనుండటంతో.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఇప్పటి నుంచే హెచ్చరికలు చేస్తోంది. ఇవాళ, రేపు ఏపీలో పొడి వాతావరణమే ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. సీమ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది.   

Tags:    

Similar News