AMIT SHAH: దశాబ్దాల రైతుల కలను నెరవేర్చాం: అమిత్ షా
నిజమాబాద్‌లో పర్యటించిన అమిత్ షా... పసుపు బోర్డు కార్యాలయం ఆరంభం;
నిజామాబాద్ రైతులు పసుపుబోర్డు కోసం 40 ఏళ్ల పాటు పోరాటం చేశారని కేంద్రమంత్రి అమిత్ షా గుర్తు చేశారు. నిజామబాద్‌లో పసుపుబోర్డు జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం స్థానిక పాలిటెక్నిక్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన రైతు సమ్మేళన సభలో ఆయన ప్రసంగించారు. నిజామాబాద్ రైతులు పండించిన పసుపు భవిష్యత్‌లో ప్రపంచమంతా ఎగుమతి అవుతుందన్నారు. పసుపుబోర్డు కార్యాలయం ఏర్పాటుతో స్థానిక రైతులకు ఎన్నో ప్రయోజనాలు కలగనున్నాయని ఆయన చెప్పారు. భారత్ ఆర్గానిక్ లిమిటెడ్, భారత్ ఎక్స్‌పోర్టు లిమిటెడ్ కూడా నిజామాబాద్‌లోనే ఏర్పాటవుతున్నాయని వివరించారు. భారత్ ఎక్స్‌పోర్టు లిమిటెడ్‌తో నిజామాబాద్ పసుపు అమెరికా, యూరప్‌కు ఎగుమతి అవుతుందని అమిత్ షా వెల్లడించారు.
అధికారంలోకి వస్తాం - అమిత్ షా
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావటం ఖాయమన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ అవినీతి పార్టీలని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఢిల్లీకి ఏటీఎంగా మార్చేసిందని ఆరోపించారు. తెలంగాణలో బీఆర్ఎస్ పోయింది కానీ… అవినీతి పోలేదన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం ఎంపీ అర్వింద్ నిజామాబాద్‌కు పసుపు బోర్డు సాధించారని అమిత్ షా ప్రశంసించారు. పసుపు రైతులకు ప్రధాని ఇచ్చిన హామీ నెరవేరిందన్నారు. దేశంలోని పసుపు రైతులకు అభినందనలు తెలుపుతున్నానని… పసుపు బోర్డు వల్ల ప్రపంచంలోని పలు దేశాలకు నిజామాబాద్ పసుపు వెళ్తుందని చెప్పారు. ఈ సభ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆపరేషన్ సిందూర్‌పై రాహుల్ ఆధారాలు అడుగుతున్నారని… పాకిస్థాన్ మాట రాహుల్‌గాంధీ నోట వినబడుతోందని విమర్శించారు. ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్థాన్‌కు గట్టిగా బుద్ధి చెప్పామని వ్యాఖ్యానించారు.
దేశంలో నక్సలిజం లేకుండా చేస్తాం
మావోయిస్టులు తక్షణమే హత్యాకాండ ఆపేసి లొంగిపోవాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ‘పహల్గాంలో ఉగ్రదాడితో పాకిస్థాన్ మనల్ని భయపెట్టాలని చూసిందని ఆ తర్వాత భారత్ శక్తి ఏమిటో ఆదేశానికి, ప్రపంచానికి తెలిసింది అని అమిత్‌షా పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని మాత్రమే కాకుండా దేశంలోని నక్సలిజం కూడా లేకుండా చేయాలన్నదే మోదీ లక్ష్యమని స్పష్టం చేశారు. నక్సలిజాన్ని తుదముట్టించాలా లేదా? మీరే చెప్పండని అక్కడ ఉన్న సభికుల్ని ఉద్దేశించి అమిత్‌షా అన్నారు. 2026 మార్చి 30 లోపు దేశంలో నక్సలిజం లేకుండా చేస్తామని స్పష్టం చేశారు. నక్సలైట్లు తక్షణమే హత్యాకాండ ఆపేసి లొంగిపోవాలని కోరారు. నక్సలైట్లు త్వరగా జనజీవన స్రవంతిలోకి రావాలని అమిత్‌షా పిలుపునిచ్చారు.