TG: "కొమురంభీమ్ కన్జర్వేషన్ కారిడార్" కు బ్రేక్
జీవో 49ను నిలిపేసిన తెలంగాణ ప్రభుత్వం.. ఆదివాసీల అనుమానాలతో నిలిపేస్తూ నిర్ణయం;
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గిరిజనులు ఆగ్రహానికి గురి అవుతున్న జీవో నెంబర్ 49పై తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతానికి జీవోను నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. దీనిపై ఆదివాసీలు, నాయకులు ప్రభుత్వానికి కృతజ్ఞత తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బంద్‌కు పిలుపునిచ్చిన రోజునే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆదివాసీల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని, వారి ఆందోళనలను నివృత్తి చేసే వరకు జీవో అమలును నిలిపి ఉంచాలని ప్రభుత్వం స్పష్టంచేసింది. కన్జర్వేషన్ కారిడార్ వల్ల తమ జీవనోపాధిపై ప్రభావం పడుతుందని ఆదివాసీ సంఘాలు ఇటీవల పెద్దఎత్తున నిరసనలు తెలిపిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ఈ అంశంపై మరిన్ని చర్చలు జరిపి, ప్రజల అనుమానాలను నివృత్తి చేసిన తరువాత తగిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు 3 లక్షల ఎకరాల అటవీ భూమిని కొమ్రంభీమ్ కన్జెర్వేషన్ కారిడార్‌గా మార్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జీవో నెంబర్ 49ను విడుదల చేసింది. తమ ప్రాంతాన్ని ఇలా మార్చడంపై గిరిజనం ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అంగీకరించేది లేదని చాలా కాలం నుంచి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు. దీంతో సచివాలయంలో మంత్రి సీతక్క, ఆదివాసీలు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఆదివాసీల పక్షాణ ఉంటుందని ఎమ్మెల్యే బొజ్జు పటేల్ అన్నారు. ఎన్ని చేసినా ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో చివరకు ఉద్యమ పంథాను అందుకున్నారు.
కన్జర్వేషన్ రిజర్వ్ అంటే ఏంటి?
ప్రధానంగా, మహారాష్ట్రలోని తాడోబా పులుల సంరక్షణ కేంద్రం, ఉమ్మడి ఆదిలాబాద్‌లోని కవ్వాల్ టైగర్ రిజర్వ్‌ను అటవీప్రాంతం గుండా కలిపే కారిడార్ ప్రాంతాన్ని "కుమ్రం భీమ్ కన్జర్వేషన్ రిజర్వ్'' గా ప్రకటిస్తూ మే 30,2025న తెలంగాణ ప్రభుత్వం జీవో 49ను జారీ చేసింది. జాతీయ వన్యప్రాణుల (సంరక్షణ) చట్టం-1972 లోని 36-ఏ నిబంధన ప్రకారం కన్జర్వేషన్ రిజర్వ్‌గా డిక్లేర్ చేస్తున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొంది. ఈ నిబంధన ప్రకారం.. స్థానికులతో సంప్రదింపుల అనంతరం అభయారణ్యాలు, వన్యప్రాణి రక్షిత ప్రాంతాలను అనుసంధానించే ప్రాంతాలను అక్కడి వృక్ష, జంతు జాలం , వాటి ఆవాసాలను రక్షించడానికి పరిరక్షణ రిజర్వ్ ( కన్జర్వేషన్ రిజర్వ్) గా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించవచ్చు. ముఖ్యమంత్రి దీనిపై స్పదించి జీవో 49ను నిలిపివేయాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గిరిజన ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. ప్రస్తుతనికి జీవో 49ను నిలిపేస్తున్నట్టు ఆదేశాలు జారీ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గిరిజన ఉద్యమ నాయకులు కృతజ్ఞత తెలిపారు.