తుపాను ప్రభావంతో వరంగల్ జలదిగ్బంధంలో చిక్కుకుంది. బుధవారం కురిసిన వర్షానికి వరంగల్-హనుమకొండను అనుసంధానం చేసే హంటర్ రోడ్డులో బొంది వాగు ఉప్పొంగింది. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే ములుగు రోడ్డు వద్ద నాలా ఉద్ధృతంగా ప్రవహించడంతో వరంగల్ నుంచి హనుమకొండకు రవాణాకు అంతరాయం కలిగింది. సమీప కాలనీలోని ఇళ్లలోకి వరద నీరు చేరడంతో కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారు. వరంగల్ లోని రెడ్లవాడలో 31.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవగా.. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లిలో 29 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డ్ అయింది. కల్లెడలో అత్యధికంగా 38 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది.
మొంథా తుఫాను తెలంగాణపై తీవ్ర ప్రభావం చూపింది. తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురవడంతో వరంగల్, హన్మకొండ జిల్లాలోని రోడ్లన్నీ జలమయం అయ్యాయి. చెరువులు, కుంటలు ఉప్పొంగి, జనావాసాలను నీటిమయం చేసాయి. ఈక్రమంలో వరంగల్, హన్మకొండ జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు జిల కలెక్టర్ సత్య శారద. అలాగే 24/7 కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి, అత్యవసర సహాయం కోసం వరంగల్, హన్మకొండ జిల్లా కలెక్టరేట్ నెంబర్లు 1800 425 3424, 9154225936, 1800 425 1115 ఫోన్ చేయాలని సూచించారు. అలాగే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో 1800 425 1980, 9701999676 టోల్ ఫ్రీ నంబర్ కూడా ఏర్పాటు చేసారు. విద్యుత్ కు సంబంధించిన సమస్యల కోసం పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో 1800 425 0028 టోల్ ఫ్రీ నంబరును కూడా ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ పేర్కొన్నారు.