తెలంగాణ ఎక్సైజ్ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా 34 ప్రాంతాల్లో 2,620 మద్యం దుకాణాలకు లాటరీ ద్వారా లైసెన్స్ కేటాయించే ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ లాటరీ ప్రక్రియ ఇవాళ ఉదయం 11 గంటలకు కలెక్టర్ల చేతుల ద్వారా నిర్వహించబడనుంది. మద్యం షాపుల డ్రాకు హైకోర్టు ఆమోదం కూడా అందించినట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలోని 2,620 మద్యం షాపులకు మొత్తం 95,137 దరఖాస్తులు సమర్పించబడ్డాయి. ఈ దరఖాస్తులను లాటరీ విధానంలో పరిశీలించి, సరైన కేటాయింపును నిర్ణయించనున్నారు.
ఈసారి మద్యం దుకాణాల టెండర్లకు రికార్డు స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి భారీ ఆదాయాన్ని అందించింది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 2,620 దుకాణాలకు గాను ఏకంగా 95,137 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో దరఖాస్తుకు ప్రభుత్వం రూ. 3 లక్షల నాన్-రిఫండబుల్ ఫీజును వసూలు చేసింది. ఈ రికార్డు స్థాయి దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి దాదాపు రూ.2854.11 కోట్లు ఆదాయం వచ్చింది. 2023 సంవత్సరంలో దరఖాస్తు ఫీజు రూ.2 లక్షలు ఉండగా.. లక్షా 32 వేలకుపైగా దరఖాస్తులు వచ్చి రూ.2,640 కోట్లు ఆదాయం వచ్చింది. ఈ సారి దరఖాస్తుల సంఖ్య తగ్గినా ఫీజు ఎక్కువగా ఉండటంతో.. గతం కంటే కూడా ఈసారి అదాయం ఎక్కువగానే సమకూరింది.