TG: ప్రపంచంతో పోటీ పడాలనే స్పోర్ట్స్ పాలసీ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి..యువత క్రీడల్లో రాణించాలన్న సీఎం... భారత్ బలమైన క్రీడా వేదిక కావాలి;
తెలంగాణలో క్రీడలను ప్రోత్సహించడం తమ ప్రభుత్వ విధానమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. క్రీడా విధానంలో రాజకీయ జోక్యాన్ని తగ్గించి క్రీడాకారుల స్ఫూర్తిని పెంపొందించాలని రాష్ట్రంలో క్రీడా పాలసీని-2025 తీసుకువచ్చామన్నారు. తమ విజన్ డాక్యుమెంట్ తెలంగాణ రైజింగ్-2047లో స్పోర్ట్స్ పాలసీని ఒక అధ్యాయంగా పెట్టామన్నామన్నారు. హైదరాబాద్ హెచ్ఐసీసీలో జరిగిన ‘ఫస్ట్ ఎడిషన్ తెలంగాణ స్పోర్ట్స్ కాంక్లేవ్’లో సీఎం రేవంత్ పాల్గొన్నారు. మంత్రి వాకిటి శ్రీహరి, ఒలింపిక్ పతక విజేత అభినవ్ బింద్రా, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (క్రీడలు) ఏపీ జితేందర్‌రెడ్డి, శాట్ చైర్మన్ శివసేనారెడ్డి హాజరయ్యారు. అనంతరం ‘తెలంగాణ స్పోర్ట్స్ పాలసీ-2025’ని సీఎం విడుదల చేశారు. ప్రపంచంతో పోటీ పడాలనే స్పోర్ట్స్ పాలసీని తీసుకువస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. క్రీడా విధానం లేకపోవడం వల్ల పట్టణ ప్రాంతాల్లోని యువత పెడదోవ పడుతున్నారని, క్రీడలను ప్రోత్సహించకపోవడం వల్లే యువత డ్రగ్స్ తీసుకుంటున్నారని సీఎం పేర్కొన్నారు. చదువుల్లోనే కాదు.. క్రీడల్లోనూ యువత రాణించాల్సిన అవసరం ఉందన్నారు. హెచ్ఐసీసీలో జరిగిన తెలంగాణ స్పోర్ట్స్ కాంక్లేవ్‌లో ‘తెలంగాణ స్పోర్ట్స్ పాలసీ’ని సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. సీఎం మాట్లాడుతూ.. దేశంలో నూతన విధానాన్ని ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రపంచంతో పోటీపడే మనం.. క్రీడల్లో వెనకబడి ఉండడం బాగాలేదన్నారు. భారత్‌కు బలమైన క్రీడా వేదిక కావాలని.. అందులో తెలంగాణ ప్రధానంగా ఉండాలని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. . దేశ క్రీడా రంగంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపడం, ఒలింపిక్స్‌లో పతకాలు సాధించే క్రీడాకారులను తయారు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం కొత్త స్పోర్ట్స్ పాలసీని రూపొందించింది.
తెలంగాణకు నూతన క్రీడాపాలిసీ..
ప్రభుత్వాలకు సరైన విధానాలు లేకపోవడం వల్ల యువత వ్యసనాలకు బానిస అవుతున్నారన్నారు. ప్రభుత్వాలు క్రీడలను ప్రోత్సహించకపోవడం వల్ల మాదక ద్రవ్యాలు మన వైపు దూసుకువస్తున్నాయన్నారు. పోరాట స్ఫూర్తి ఉన్న తెలంగాణ ప్రాంతం క్రీడల్లో రాణించాలని కోరారు. ప్రపంచంతోనే పోటీపడి దేశానికి మంచి పేరు తీసుకురావాలని తెలంగాణకు నూతన క్రీడాపాలిసీని తీసుకువచ్చినట్లు చెప్పారు. క్రీడామైదానాలు వివాహాలు చేసుకునే ఫంక్షన్ హాళ్లుగా లేదా సన్ బర్న్ ఈవెంట్ చేసుకునే వేదికగా మారిందన్నారు. ఈ విధానానికి స్వస్తి పలకాలని స్పష్టమైన క్రీడా విధానం, స్పోర్ట్స్, యూనివర్సిటీ, స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఎందరో గొప్ప గొప్ప క్రీడాకారులు హైదరాబాద్ నుంచి ఉన్నారన్నారు.
అయిదు ప్రధాన అంశాలతో క్రీడా పాలసీ
అయిదు ప్రధాన అంశాలతో తెలంగాణ క్రీడా పాలసీ రూపకల్పన చేశామని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. క్రీడల అభివృద్ధి, స్కిల్ డెవలప్ మెంట్, మౌలిక సదుపాయలు ఈ పాలసీలో ఉంటాయన్నారు. రాష్ట్రంలో పటిష్టమైన క్రీడా విధానాన్ని రూపొందించామని పారదర్శకమైన జవాబుదారితనం ఈ పాలసీలో ఉండబోతున్నదన్నారు. స్పోర్ట్స్ పాలసీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిత్యం ఆరా తీస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి దూరదృష్టితో గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నామన్నారు. దేశంలోనే స్పోర్ట్స్ లో తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా మారాలన్నారు. గ్రామ స్థాయి క్రీడాకారులను వెలికి తీసి అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దుతామని చెప్పారు. మని రాష్ట్రంలో త్వరలోనే స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయబోతున్నామన్నారు.