TG: భారీ వర్షాలతో తెలంగాణ అతలాకుతలం
మొంథా తుపాను ప్రభావంతో భారీ వర్షాలు.. వరంగల్ జిల్లాలో ఎడతెరపిలేని వానలు.. ఖమ్మం, నల్గొండ జిల్లాలో ఏకధాటి వర్షం
మొంథా తుఫాన్ ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం పూర్తిగా మారిపోయింది. అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హన్మకొండ, హైదరాబాద్, జనగాం, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, మేడ్చల్-మల్కాజ్గిరి, నాగర్‌కర్నూలు, నల్గొండ, నారాయణపేట్, రంగారెడ్డి, సిద్దిపేట్, సూర్యాపేట్, వికారాబాద్, వనపర్తి, వరంగల్, యాదాద్రి-భువనగిరి జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. భారీ వర్షాల నేపథ్యంలో మహబూబ్‌నగర్, మహబూబాద్, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట జిల్లల్లోలఅన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరం లేకుండా బయటకు వెళ్లరాదని అధికారులు సూచించారు.
అత్యధికంగా 20.8 సెం.మీ వర్షపాతం
నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతలలో అత్యధికంగా 20.8 సెం.మీ. వర్షపాతం నమోదైంది. నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్‌లో 19.7 సెం.మీ, నల్గొండ జిల్లా తెల్దేవరపల్లిలో 18.5 సెం.మీ, నాగర్‌కర్నూల్ జిల్లా వెల్టూర్లో 18.3 సెం.మీ, ఐనోలులో 17.8 సెం.మీ, నల్గొండ జిల్లా ఎర్రారంలో 15.1, పోలేపల్లిలో 13.3 సెం.మీ, రంగారెడ్డి జిల్లా వెలిజాలలో 13.9, వనపర్తి జిల్లా రేవల్లిలో 12.6, మిడ్జిల్‌లో 11.9 సెం.మీ వర్షపాతం నమోదైంది. దీంతో పలు ప్రాంతాలు నీట మునిగాయి.. లోతుట్టు ప్రాంతాల్లోకి నీరు చేరడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి.. తెలంగాణ మహబూబాబాద్ జిల్లాలో రైలు పట్టాలపైకి వరద నీరు చేరడంతో అధికారులు అప్రమత్తమయ్యాయి.. డోర్నకల్ రైల్వేస్టేషన్లో పట్టాల పైనుంచి వరదనీరు ప్రవహిస్తుండటంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. డోర్నకల్ రైల్వేస్టేషన్లో గోల్కొండ ఎక్స్‌ప్రెస్, మహబూబాబాద్‌లో కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లను రైల్వే అధికారులు నిలిపివేశారు. తుఫాన్ ప్రభావంతో హైదరాబాద్ లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో భీకర వర్షాలు కురుస్తున్న వేళ ప్రభుత్వాలు పూర్తి అప్రమత్తతో ఉన్నాయి. అధికారులు హై అలెర్ట్ లో ఉండాలని ఆదేశాలు జారీ చేశాయి.
భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలని ఎంపీ పోరిక బలరాంనాయక్, ఎమ్మెల్యే భూక్యా మురళీనాయక్ వేర్వేరు ప్రకటనల్లో కోరారు.మత్స్యకారులు, ప్రజలు ఎవరూ కూడా జలాశయాల వద్దకు వెళ్లొద్దని కోరారు.