Telangana News : కోడ్ ముగియగానే కొలువుల జాతర
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీని శరవేగంగా చేపట్టేందుకు టీజీపీఎస్సీ కార్యచరణ
లోక్‌సభ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే రాష్ట్రంలో కొలువుల జాతర కొనసాగనుంది. కోడ్ కారణంగా నిలిచిపోయిన పలు నోటిఫికేషన్లకు ఫలితాల వెల్లడితో పాటు ఇప్పటికే నియామకపత్రాలు తీసుకున్న అభ్యర్థులకు పోస్టింగులు దక్కనున్నాయి.
ఎన్నికల నియమావళి అయిపోగానే..రాష్ట్రంలోని నిరుద్యోగుల నిరీక్షణకు తెరపడనుంది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీని శరవేగంగా చేపట్టేందుకు TGPSC కార్యచరణ సిద్ధం చేసింది. గురుకుల, పోలీసు నియామక బోర్డుల పరిధిలో నియామకాలు పూర్తికాగా, TGPSC పరిధిలో భారీ ఎత్తున పలు నోటిఫికేషన్లకు ఫలితాలు వెల్లడికానున్నాయి. గురుకుల సొసైటీలు జూన్ నెలాఖరులోగా పోస్టింగుల ప్రక్రియ పూర్తిచేయాలన్న లక్ష్యంతో ఉన్నాయి. TGPSC పరిధిలో దాదాపు 13 వేలకు పైగా పోస్టులకు సంబంధించి తుది ఫలితాల వెల్లడి, ధ్రువీకరణ పత్రాల పరిశీలన దశలో ఉన్నాయి. పరిశీలన పూర్తయిన నోటిఫికేషన్లకు త్వరలో తుది ఫలితాలు ప్రకటించనుంది. జనరల్ ర్యాంకు జాబితా వెల్లడైన నోటిఫికేషన్లకు ధ్రువీకరణ పత్రాల పరిశీలన పూర్తిచేసి రెండు, మూడు నెలల్లో నియామకాలు పూర్తిచేయాలన్న లక్ష్యంతో కమిషన్ పనిచేస్తోంది. టీజీపీఎస్సీ జారీ చేసిన ఉద్యోగ ప్రకటనల్లో అత్యధికంగా గ్రూప్-4 కింద 8 వేల 180 పోస్టులు ఉన్నాయి. రాతపరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా జీఆర్‌ఎల్ వెల్లడైంది. క్రీడా కేటగిరీలో 1,569 మందికి ధ్రువీకరణ పత్రాల పరిశీలన పూర్తయింది. మిగతా అభ్యర్థుల పత్రాల పరిశీలన ఈనెలలో ప్రారంభించేందుకు కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది. .
ప్రభుత్వ విభాగాల్లో 1,540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టులకు సంబంధించి మెరిట్ అభ్యర్థుల పత్రాల పరిశీలన పూర్తయింది. తుది ఫలితాల కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వ విభాగాల్లో 833 అసిస్టెంట్ ఇంజినీరు పోస్టుల తుది కీతో పాటు జీఆర్‌ఎల్‌ను కమిషన్ విడుదల చేసింది.1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితా రూపొందించి పత్రాల పరిశీలన చేయాల్సి ఉంది. వ్యవసాయ అధికారుల పోస్టులకు సంబంధించి పరిశీలన ముగిసింది. వెటర్నరీ అసిస్టెంట్ పోస్టుల జీఆర్‌ఎల్ విడుదలైంది. పురపాలక శాఖలో ఎకౌంటెంట్ పోస్టులకు ధ్రువీకరణ పత్రాల పరిశీలన ముగిసింది. సాంకేతికవిద్య విభాగంలోని 247 పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులకు కమిషన్ జీఆర్‌ఎల్ ప్రకటించింది. ఈ పోస్టులకు మెరిట్ జాబితా రూపొందించి పత్రాల పరిశీలన చేయాల్సి ఉంది. ఇంటర్ విద్య విభాగంలో 1,392 జూనియర్ లెక్చరర్ పోస్టులకు తుది కీ వెల్లడైంది. రవాణా శాఖలో 113 ఏఎంవీఐ పోస్టులకు జూన్‌లో పత్రాల పరిశీలన జరగనుంది. వివిధ దశల్లోని నియామక ప్రక్రియను వేగంగా పూర్తిచేసి ఫలితాలు ప్రకటించాలని కమిషన్ భావిస్తోంది.
రాష్ట్రంలో 563 గ్రూప్-1 సర్వీసు ఉద్యోగాల కోసం జూన్ 9న నిర్వహించే ప్రిలిమినరీ పరీక్ష కోసం TGPSC అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తిచేసింది. హాల్‌టికెట్లు శనివారం అందుబాటులోకి రానున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకున్న తరువాత వ్యక్తిగత వివరాల్లో భాగంగా పేరులో పొరపాట్లు దొర్లితే అభ్యర్థులు ప్రత్యేకంగా డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది.