TGPSC: గ్రూప్ 1 ఫలితాల విడుదల తేదీ ఖరారు

గ్రూప్-2, గ్రూప్-3 ఫలితాలు కూడా... ముగిసిన గ్రూప్ 1 పరీక్షల మూల్యాంకనం;

Update: 2025-03-08 02:00 GMT

తెలంగాణలో గ్రూప్ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శుభవార్త చెప్పింది. గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 పరీక్షల ఫలితాలకు సంబంధించి కీలక అప్‌డేట్ ఇచ్చింది. మార్చి 10న గ్రూప్‌-1 ఫలితాలను, మార్చి 11న గ్రూప్‌-2 ఫలితాలను, మార్చి 14న గ్రూప్‌-3 ఫలితాలను విడుదల చేస్తామని టీజీపీఎస్సీ ప్రకటించింది. మార్చి 17న హాస్టల్ వెల్‌ఫేర్ ఆఫీసర్స్‌ పోస్టుల ఫలితాలను, మార్చి 19న ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్స్‌ ఫలితాలను వెల్లడించనున్నట్లు టీజీపీఎస్సీ స్పష్టం చేసింది.

ఇక ప్రకటించడమే ఆలస్యం

తెలంగాణలో మొత్తం 563 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రధాన పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ముగిసింది. అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా 1:2 నిష్పత్తిలో మెరిట్‌ జాబితా వెల్లడికి టీజీపీఎస్సీ తుది పరిశీలన చేస్తోంది. యూపీఎస్సీ తరహాలో ఏడాదిలోగా నియామక ప్రక్రియ పూర్తిచేసే విధానాన్ని గ్రూప్‌-1లో అమలు చేయాలని టీజీపీఎస్సీ భావిస్తోంది. తెలంగాణలో 563 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ 2024 ఫిబ్రవరి 19న నోటిఫికేషన్ విడుదల చేయగా.. మొత్తం 4,03,645 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరికి జూన్‌ 9న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు. ప్రిలిమ్స్ పరీక్ష నుంచి మెయిన్స్ పరీక్షలకు 1:50 నిష్పత్తిలో మొత్తం 31,382 మంది అభ్యర్థులను టీజీపీఎస్సీ ఎంపిక చేసింది. మొత్తం 31,403 మంది మెయిన్స్ పరీక్షలకు హాజరయ్యారు. ఇక మెయిన్స్ పరీక్షలకు సంబంధించి మొత్తం 7 పేపర్లు రాసిన అభ్యర్థులు 21,093 మంది ఉన్నారు.

నిశితంగా జవాబు పత్రాల పరిశీలన

గ్రూప్ 1 పరీక్ష పత్రాల మూల్యాంకాన్ని టీజీపీఎస్సీ పకడ్బంధీగా నిర్వహించింది. ఒక్కో పేపరును రెండుసార్లు మూల్యాంకనం చేశారు. ఒక అభ్యర్థి జవాబుపత్రం తొలిదశ మూల్యాంకనం తర్వాత వచ్చిన మార్కులకు.. రెండోదశ మూల్యాంకనంలో వచ్చిన మార్కులకు పెద్దగా వ్యత్యాసం లేకుండా ఉండేందుకు అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ తర్వాత అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా 1:2 నిష్పత్తిలో మెరిట్‌ జాబితాను రూపొందించారు.

గ్రూప్-2 ఫలితాలు కూడా...

తెలంగాణలో నిర్వహించిన గ్రూప్‌ 2 ఫలితాలను విడుదల చేసేందుకు కూడా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్ కమిషన్ కసరత్తు చేస్తోంది. 783 ఉద్యోగాల భర్తీ కోసం గతేడాది నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్షల కోసం ఎగ్జామ్‌ను డిసెంబ్‌ 15, 16 తేదీల్లో నిర్వహించింది. ఆ ఫలితాలను త్వరలోనే విడుదల చేయడానికి ప్రక్రియను వేగవంతం చేసింది.

Tags:    

Similar News