ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన ఓ రైతు తన వెంట ఒక కవర్లో డీజిల్ తీసుకొచ్చాడు. రైతు వద్ద కవర్లో డీజిల్ ఉన్న విషయాన్ని గమనించిన పోలీసులు అతడిని హాల్ నుంచి బయటికి పంపించివేశారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఇవాళ చోటు చేసుకుంది. జిల్లాలోని అక్కన్నపేట మండలం గోవర్ధనగిరికి చెందిన రైతు చిలుకూరి ఎల్లారెడ్డి తన భూసమస్య చాలా కాలంగా పరిష్కారం కావడం లేదన్న ఆవేదనతో కవర్లో డీజిల్ పోసుకొని వచ్చాడు. తనకు సంబంధించిన 17 ఎకరాల భూమిని బ్లాక్ లిస్ట్లో పెట్టడం ద్వారా ఇబ్బందులు ఏర్పడుతున్నట్లు చెప్పారు. ఐకేపీ కొనగోలు కేంద్రంలో ధాన్యం కొనడం లేదని వాపోయారు. తహసీల్దారుకు ఈ విషయాన్ని ఎన్నిసార్లు చెప్పినప్పిటికీ పలితం లేకపోవడంతో కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చినట్లు తెలిపారు. మరోవైపు తన భూమి సమస్యను పరిష్కరించడం లేదన్న ఆవేదనతో ఓ వ్యక్తి ప్రజావాణికి వచ్చి ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు. ఈ ఘటన ఘటన యాదాద్రి కలెక్టరేట్ వద్ద జరిగింది. యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండలం నాగినేనిపల్లికి చెందిన తడకపల్లి ఆగిరెడ్డికి సర్వేనంబర్ 340, 345ఏ, 346లో కొంత భూమి ఉంది. ధరణి వచ్చిన తర్వాత ఆ భూమి మహిపాల్‌రెడ్డి అనే పేరున ఉన్నట్లు కనిపిస్తోంది.