TG : కేటీఆర్‌ను అప్రతిష్టపాలు చేయాలని చూస్తున్నారు : ఎమ్మెల్యే హరీశ్ రావు
ప్రభుత్వం కేటీఆర్‌ను అప్రతిష్టపాలు చేసి బీఆర్‌ఎస్‌ను ఇబ్బంది పెట్టాలని చూస్తోందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. అసెంబ్లీ నడిచే సమయంలో ఒక ఎమ్మెల్యేపై అక్రమ కేసు పెట్టారన్నారు. ఫార్ములా-ఈ కార్ రేస్ అంశంలో రకరకాల లీకులు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తాము తప్పు చేశామంటున్నారని, సభలో చర్చించి అదేదో చెప్పాలని డిమాండ్ చేశారు. తాము ఎలాంటి తప్పు చేయలేదని..రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు ఫార్ములా-ఈ రేస్ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.
ఫార్ములా ఈ రేసింగ్‌పై అసెంబ్లీలో చర్చ పెట్టకుండా ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. ఈ రేసింగ్ వ్యవహారంలో అవినీతి జరిగిందంటున్న ప్రభుత్వం ఎందుకు చర్చ పెట్టడం లేదని ప్రశ్నించారు. స్పీకర్‌ను ప్రత్యేకంగా కలిసి విజ్ఞప్తి చేసినా చర్చ పెట్టలేదన్నారు. ప్రభుత్వ తీరుపై శాసనసభలో తమ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ హయాంలో ఫార్ములా ఈ రేస్ నిర్వహించి తెలంగాణ గౌరవాన్ని గ్లోబల్ స్టేజ్‌కి తీసుకెళ్లామని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. కానీ కాంగ్రెస్ రేస్‌ను రద్దు చేసి రాష్ట్ర ప్రతిష్ఠను కోర్టు గేట్ల ముందు నిలబెట్టిందని మండిపడ్డారు. తప్పుడు పాలనతో రేవంత్ తెలంగాణ బ్రాండ్‌ను చెరిపేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తాము తెలంగాణను ప్రపంచ పటంలో నిలబెట్టాలనుకుంటే.. రేవంత్ మాత్రం అక్రమ కేసులతో పాలన చేస్తున్నారని ఫైర్ అయ్యారు.