రుణమాఫీ కాలేదని రైతులు ఆందోళన పడొద్దని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మూడు విడతల్లో ఈ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. పాస్‌బుక్ లేకపోయినా.. తెల్లకార్డు ద్వారా రుణమాఫీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. టెక్నికల్ ఇష్యూస్ వల్ల 30 వేల ఖాతాల్లో డబ్బులు జమ కాలేదని.. పొరపాట్లు సరిచేసి అర్హులందరికీ రుణమాఫీ చేస్తామన్నారు. రుణ విముక్తుల్ని చేస్తామన్నారు. మంగళవారం సెక్రటేరియట్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో రుణమాఫీ సరిగా జరగలేదన్న భావన రైతుల్లో ఉందన్నారు. ఓఆర్‌ఆర్‌ను రూ.7 వేల కోట్లకు అమ్మి రుణమాఫీ చేయాలని గత ప్రభుత్వం ఆలోచించిందని విమర్శించారు.
గత పాలకులు సరైన పద్ధతిలో రుణమాఫీ చేయకపోయినప్పటికీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాత్రం విమర్శిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ‘వరంగల్ డిక్లరేషన్‌లో ప్రకటించిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తోంది. ఎన్ని కష్టాలున్నా ఈ అంశంలో ముందుకెళ్తున్నాం. ప్రతిపక్ష నేతలు అనవసర ఆరోపణలు చేస్తున్నారు. గత ఐదేళ్లలో రైతులు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తున్నాం. ఆగస్టు 15న రూ.2 లక్షల వరకు రుణమాఫీ కార్యక్రమాన్ని వైరాలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభిస్తారు. రైతు భరోసాపై అభిప్రాయ సేకరణ కొనసాగుతోంది’ అని తుమ్మల వెల్లడించారు.