అల్లు అర్జున్ అభిమానుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ ఆయన ఇంటిపై దాడి చేసిన వారు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ‘ఇంటిపై దాడి చేసినందుకు వెంటనే అల్లు అర్జున్‌కు క్షమాపణ చెప్పాలని అల్లు అర్మీ, అల్లు అర్జున్ ఫ్యాన్స్ పేరుతో వందల కాల్స్ వస్తున్నాయి. చంపేస్తామని బెదిరిస్తున్నారు. అల్లు అర్జున్ అభిమానుల నుంచి మాకు ప్రాణహాని ఉంది. మా ఫోన్ నెంబర్లు సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేస్తున్నారు. మాకు ఫోన్ కాల్స్ రాకుండా చేయాల్సిన బాధ్యత అల్లు అర్జున్‌దే. ఫోన్ కాల్స్ ఆగకపోతే వేలాది మందితో అల్లు అర్జున్ ఇంటిని ముట్టడిస్తాం. ఫోన్ చేసి బెదిరిస్తున్న వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి’ అని ఫిర్యాదులో పేర్కొన్నారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి మరణానికి అల్లు అర్జున్ కారణమంటూ ఇటీవల ఓయూ విద్యార్థి జేఏసీ నేతలు ఆందోళనకు దిగారు. రేవతి కుటుంబానికి రూ.కోటి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ అల్లు అర్జున్ నివాసంపై రాళ్లు విసిరారు. ఆయన ఇంట్లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు.