తెలంగాణలో మరో మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. తేలికపాటి నుంచి ఓ మోస్తరు స్థాయిలో వర్షాలు కురవనున్నాయని తెలిపింది. వర్షాలతో ఉష్ణోగ్రతలు కనిష్ఠంగా 26 డిగ్రీల నుంచి గరిష్ఠంగా 42 డిగ్రీల వరకు ఉండనున్నాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు.
అత్యధికంగా ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, కుమురంభీం, మంచిర్యాల, వరంగల్, కామారెడ్డి, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్, జిల్లాల్లో 42.2 డిగ్రీల వరకు ఉష్ణోగత్రలు నమోదుకానున్నాయి. మరోవైపు జీహెచ్‌ఎంసీ పరిధిలో కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తరులో వర్షాలు కురవనున్నాయి. దీంతో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టనున్నాయి. మొన్నటిదాకా 45 డిగ్రీలు నమోదైన ఉష్ణోగ్రతలు గురువారం 42.9 డిగ్రీలకు చేరాయి.
మే 13వ తేదీన వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల్ జిల్లాల్లో అక్కడకక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలను జారీ చేసింది.
మరోవైపు ఏపీకి కూడా వర్ష సూచన ఉంది. ఇవాళ, రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తాతో పాటు సీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది