Tiger: పులులుకు ఆవాసాలుగా కాగజ్‌నగర్‌ అడవులు

తడోబా టూ కాగజ్ నగర్

Update: 2023-12-16 01:30 GMT

 కుమురంభీం జిల్లా కాగజ్‌నగర్‌ అడవులు పులులుకు ఆవాసాలుగా మారుతున్నాయి. మహారాష్ట్రలోని తడోబా నుంచి తరలివస్తున్న ఈ పులులు... స్థానికులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మూడేళ్లలో వీటి దాడిలో ముగ్గురు హతమవ్వగా.... తాజాగా బెబ్బులి ఓ పశువుల కాపరిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. సమీప గ్రామాల ప్రజలు వ్యవసాయ పనులకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అటవీ ప్రాంతాల్లో నివసించే ప్రజలు నిత్యం జంతువులతో సావాసం చేయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలోనే వారు ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా పులులు సంచరించే ప్రాంతాల్లోనైతే... భయం గుప్పెట్లోనే ప్రజలు బతుకులీడుస్తున్నారు. కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని కాగజ్‌నగర్, సిర్పూర్‌, కౌటాల, చింతలమానేపల్లి, బెజ్జూర్‌, దహెగం, పెంచికల్‌పేట మండలాల్లో పెద్దపులుల సంచారం పెరిగింది. మూడేళ్లలో పులుల దాడుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా కాగజ్‌నగర్‌ మండలంలోని నందిగూడ అటవీ ప్రాంతంలో... గులాబ్‌దాస్‌ అనే పశువుల కాపరిపై బెబ్బులి దాడి చేసింది. అదృష్టవశాత్తు అతను గాయాలతో బయటపడ్డాడు. దీంతో సమీప గ్రామాల ప్రజలు బయటికెళ్లాలంటేనే భయపడుతున్నారు. 

జిల్లాలో పత్తి, వరి, కంది, మొక్కజొన్న పంటలు చేతికి వచ్చే దశ కావడంతో చేనుకు వెళ్లాలంటే... పులి ఎటువైపు నుంచి వచ్చి దాడి చేస్తుందోనని రైతులు, కూలీలు ఆందోళన చెందుతున్నారు. పులి సంచరించే ప్రాంతాల్లో పొలాలు, పంటచేలు ఉన్నాయి. రైతులు ఉదయం నుంచి రాత్రి వరకు అక్కడే ఉంటారు. అడవి పందుల బెడదతో కొందరు మంచెలు ఏర్పాటు చేసుకొని రాత్రి సమయంలో అక్కడే కాపలా ఉంటున్నారు. తాజాగా పులుల అలజడి మళ్లీ మొదలవడంతో.... నిత్యం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన కుమరంభీం జిల్లాలో దట్టమైన అటవీప్రాంతం ఉండడంతో పులులు రాకపోకలు సాగిస్తున్నాయని అధికారులు తెలిపారు. కాగజ్‌నగర్ అటవీ ప్రాంతంలో 10నుంచి 15పులుల వరకు సంచారం సాగిస్తున్నాయని వెల్లడించారు. పశువుల కాపరిపై దాడిచేసిన పులి...మహారాష్ట్ర తడోబా అభయారణ్యంలోని రాజుర అడవుల నుంచి వచ్చిందని గుర్తించారు. దానికి నాలుగు పిల్లలు కూడా ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని.... ఆ పిల్లలు సైతం మరో మూడు నెలల్లో పెద్దవై ఒంటరిగా సంచరించే అవకాశం ఉందని స్పష్టం చేశారు. జాగ్రత్తలపై ప్రజలకు ఎప్పటికప్పుడూ అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామన్న అటవీ అధికారులు... స్థానికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

జిల్లాలో పెద్దపులుల అలజడి మళ్లీ మొదలవటంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. రక్షణ చర్యలు చేపట్టాలని అటవీ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు

Tags:    

Similar News