TIGER: క్షణం క్షణం.. పులి భయం..

పెద్దపులి భయంతో వణికిపోతున్న కుమురం భీం జిల్లా.. డ్రోన్లతో పులి జాడ కోసం గాలింపు;

Update: 2024-12-01 04:30 GMT

కుమురం భీం జిల్లా వణికిపోతోంది. పని కోసం బయటకు వెళ్లాలంటే ప్రజలు జంకుతున్నారు. బయటకు వస్తే చాలు ఎక్కడి నుంచి పులి మీద పడి దాడి చేస్తుందో అని భయపడిపోతున్నారు. ఇప్పటికే పులి.. కూలీ పని చేస్తున్న లక్ష్మి అనే మహిళపై దాడి చేసి చంపేసిన విషయం తెలిసిందే. తాజాగా పొలంలో పని చేస్తున్న రైతుపైనా దాడి చేసింది. స్థానికుల కేకలతో పెద్దపులి పారిపోయింది. దీంతో పనికి వెళ్లాలన్నా కూలీలు భయపడిపోతున్నారు. 24 గంటల వ్యవధిలోనే పెద్దపులి మరో దాడి చేయడంతో జిల్లా వాసులు భయాందోళనలకు గురవుతున్నారు. సిర్పూర్ టీ మండలం దుబ్బగూడా గ్రామ శివారులో ఓ రైతు సురేష్‌పై పులి దాడి చేసి గాయపరిచింది. సురేశ్ గ్రామ శివారులోని పత్తి చేనులో పత్తి ఏరుతుండగా అకస్మాత్తుగా పులి దాడి చేసి గాయపరిచింది. వెంటనే అతన్ని సిర్పూర్ ప్తభుత్వ ఆసుపత్రికి తరలించారు.


ఆసిఫాబాద్‌లో పెద్దపులి కలకలం

ఆసిఫాబాద్ జిల్లాలో మరోసారి పెద్దపులి కలకలం రేగింది. సిర్పూర్ మండలం దుబ్బగూడలో పొలంలో పనిచేస్తున్న రైతుపై దాడి చేసింది. ఈ ఘటనలో రైతు సురేశ్ తీవ్రంగా గాయపడ్డాడు. కాగా.. శుక్రవారం వ్యవసాయ పనులకు వెళ్తున్న యువతిపై పెద్దపులి దాడి చేయగా, ఆమె మరణించింది. ఈ క్రమంలో టైగర్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టిన అటవీశాఖ అధికారులు జిల్లాలోని 15 గ్రామాల్లో 144 సెక్షన్ విధించింది.

పులిజాడ కోసం డ్రోన్‌తో గాలింపు

కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలంలో పెద్దపులి జాడ కోసం అటవీశాఖ అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. పులిజాడ కనుక్కునేందుకు డ్రోన్ కెమెరాతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మండలంలోని ఈజ్గాం ప్రాంతంలో డ్రోన్ ద్వారా అటవీశాఖ అధికారులు పులి సంచారం తెలుసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అధికారులు మాట్లాడుతూ.. పులిని త్వరలోనే కనిపెట్టేందుకు తగిన చర్యలు చేపట్టామన్నారు.

Tags:    

Similar News