సర్వేలో మంచి పేరు ఉంటేనే సీటు.. రేవంత్ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్ నేతల సమావేశంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు;
కాంగ్రెస్ నేతల సమావేశంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సీట్ల విషయం ఎవరి చేతుల్లో ఉండదని, సర్వేల్లో మంచి పేరు ఉంటేనే సీటు వస్తుందని పార్టీ నేతలకు స్పష్టం చేశారు. పీసీసీ అధ్యక్షుడిగా తన సీటు కూడా తన చేతుల్లో ఉండదన్నారు. రేవంత్ చేసిన ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ఇందిరా భవన్‌లో కాంగ్రెస్ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్స్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్స్, జనరల్ సెక్రటరీ సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ మాణిక్‌రావు ఠాక్రే, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హాజరయ్యారు. పార్టీ సంస్థాగత అంశాలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించారు. పార్టీ ఆదేశాలకు అనుగుణంగా పనిచేసిన వారిని పార్టీ తప్పకుండా పార్టీ గుర్తిస్తుందన్నారు. కర్నాటకలో సిద్దరామయ్య కోరిన సీటు అధిష్ఠానం ఇవ్వలేదని గుర్తు చేశారు. పార్టీ సర్వే చేసి చెప్పిన చోటే ఆయన పోటీ చేశారన్నారు.
ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో అందరూ పార్టీ కోసం పనిచేయాలని సూచించారు. ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దన్నారు. కర్నాటకలో బోసురాజు ఎమ్మెల్యేగా గెలిచినా మంత్రి పదవి రాకపోయేదేమో అన్నారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడటం వల్లే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కాకపోయినా మంత్రి పదవి లభించిందన్నారు. పార్టీ ఆదేశాలకు అనుగుణంగా పనిచేసిన వారిని కాంగ్రెస్ తప్పకుండగా గుర్తిస్తుందని రేవంత్ రెడ్డి చెప్పారు.