కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణ పీసీసీ చీఫ్ ఎంపికపై కసరత్తును ముమ్మరం చేసింది. ఇందుకోసం అధిష్టానం పార్టీలో అభిప్రాయ సేకరణ చేపట్టనుంది. ఇందులో భాగంగా ఈనెల 9న రాష్ట్రానికి ఏఐసీసీ బృందం రానుంది. ఈ బృందం రాష్ట్ర స్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు అభిప్రాయాలను సేకరించనుంది. పీసీసీ ఎంపిక తర్వాత పార్టీలో లుకలుకలు లేకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందుకోసమే అభిప్రాయ సేకరణ ద్వారా పీసీసీ చీఫ్ ఎంపిక చేస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
పీసీసీ చీఫ్ పదవి కోసం ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎప్పటి నుంచో పోటీపడుతున్నారు. అయితే రేసులో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, ఎమ్మెల్యేలు డి.శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి కూడా ఉన్నారు. తనను కెప్టెన్ చేయాలంటూ ఇప్పటికే కోమటిరెడ్డి ఏఐసీసీ నేతలను కోరారు. రేవంత్‌రెడ్డి కూడా పీసీసీ చీఫ్ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఏఐసీసీ నేతలతో సన్నిహితంగా ఉంటున్నారు. అయితే, సామాజిక సమీకరణాల ప్రకారం ఆలోచించాలని కాంగ్రెస్ సీనియర్ నేతలు ఏఐసీసీకి విన్నవించడంతో.. శ్రీధర్‌బాబు, భట్టి సహా మరికొందరి పేర్లు చర్చకు వచ్చాయి.