TS : బండి సంజయ్ అరెస్ట్... హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు

Update: 2023-04-05 05:04 GMT

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ ను తీవ్రంగా పరిగణిస్తోంది బీజేపీ. హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసింది. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శ్రుతి పిటిషన్‌ దాఖలు చేశారు. ఇవాళ కోర్టుకు సెలవు ఉండటంతో హైకోర్టు చీఫ్ జస్టిస్ నివాసానికి వెళ్లి ..... హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు బీజేపీ లీగల్ సెల్‌ నేతలు. మరోవైపు కాసేపట్లో హైకోర్టులో హౌస్‌ మోషన్ దాఖలు చేయనున్నారు బీజేపీ లీగల్‌ టీం నేతలు. హౌస్‌ మోషన్ పిటిషన్ పై హైకోర్టు చీఫ్ జస్టిస్ కాసేపట్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.


బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్‌ మంటలు పుట్టిస్తోంది. భువనగిరి యాదాద్రి జిల్లా బొమ్మల రామారం పోలీస్‌ స్టేషన్ దగ్గర తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. భారీగా తరలివస్తున్న బీజేపీ శ్రేణులు సంజయ్‌ అరెస్ట్‌పై తీవ్రంగా నిరసన తెలుపుతున్నారు. పోలీసులు ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టి.. వచ్చినవారిని వచ్చినట్లు అదుపులోకి తీసుకుంటున్నా.. కాషాయం శ్రేణుల ప్రవాహం ఆగలేదు. భారీ ఎత్తున బొమ్మల రామారం పీఎస్‌కు వచ్చిన బీజేపీ కార్యకర్తలు అక్కడ ధర్నాకు దిగారు. పోలీసుల తీరుపై మండిపడుతున్నారు. అటు.. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు కూడా పీఎస్‌ దగ్గర ధర్నాకు దిగడంతో పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. పోలీసులతో వాగ్వాదాలు.. తోపులాటలు కన్పించాయి.

మొత్తానికి బొమ్మల రామారం పీఎస్‌ దగ్గర యుద్ధ వాతావరణం నెలకొంది. అటు.. పీఎస్‌ దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. పోలీస్‌ స్టేషన్‌ ప్రధాన ద్వారాన్ని బారికేడ్లతో మూసివేశారు. కాసేపట్లో బండి సంజయ్‌ను బొమ్మల రామారం పీఎస్‌ నుంచి తరలించే అవకాశం ఉంది.

బండి సంజయ్‌ అరెస్ట్‌ను బీజేపీ హైకమాండ్ సీరియస్‌గా తీసుకుంది. ఇది అప్రజాస్వామిక చర్యగా పేర్కొంది. బండి అరెస్ట్‌ను కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, ఎమ్మెల్యే ఈటల, రాజాసింగ్ ఖండించారు.

బండి సంజయ్‌ను కరీంనగర్‌ పోలీసులు అర్ధరాత్రి దాటిన తర్వాత అరెస్టు చేశారు. కరీంనగర్‌ జ్యోతి నగర్‌లోని ఆయన ఇంటి నుంచి తీసుకెళ్లారు. అయితే, ముందు ఎక్కడికి తీసుకెళ్లారు… ఎందుకు అరెస్టు చేశారు అనే విషయాలపై పోలీసులు ఏమీ చెప్పలేదు. ఆ తర్వాత బొమ్మల రామారం పీఎస్‌కు తరలించారు. పదో తరగతి ప్రశ్న పత్రాల లీకేజీ కేసులోనే సంజయ్‌ను పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 100 మంది పోలీసులు సంజయ్‌ ఇంటిని చుట్టుముట్టారు. ఆయన అరెస్టుకు ప్రయత్నించారు. అదే సమయంలో బీజేపీ కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకున్నారు. దాంతో, బండి సంజయ్‌ నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తనను ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పాలని సంజయ్‌ కోరితే, అదుపులోకి తీసుకునే అధికారం తమకు ఉందంటూ పోలీసులు జవాబు ఇచ్చారని బీజేపీ వర్గాలు తెలిపాయి. చివరికి, దాదాపు ఒంటి గంట సమయంలో సంజయ్‌ను పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారు.


వరుసగా రెండో రోజు కూడా పదో తరగతి హిందీ ప్రశ్న పత్రం పరీక్ష ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే వాట్సాప్‌లో ప్రత్యక్షమైంది. హనుమకొండలో బూరం ప్రశాంత్‌ అనే జర్నలిస్ట్‌ దానిని వైరల్‌ చేశాడు. హిందీ ప్రశ్న పత్రం లీకైందని, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారంటూ బండి సంజయ్‌తోపాటు చాలామందికి దానిని ఫార్వార్డ్‌ చేశాడు. ఈ నేపథ్యంలో, బీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య సోషల్‌ మీడియాలో మాటల యుద్ధం నడిచింది. ప్రశాంత్‌కు, సంజయ్‌కు సంబంధం ఉందంటూ బీఆర్‌ఎస్‌ నేతలు ఆరోపించారు. దీనిపై బీజేపీ నేతలు ఎదురుదాడికి దిగారు. ఈ నేపథ్యంలోనే సంజయ్‌ను అరెస్టు చేశారేమోనన్న ప్రచారం జరుగుతోంది. 

Similar News