ప్రధాని మోదీ టూర్‌కు ముందు తెలంగాణ పాలిటిక్స్ హీటెక్కాయి. బండి సంజయ్ అరెస్ట్‌తో ఇప్పటికే తెలంగాణలో ఉద్రిక్త వాతావరణం ఉంది. బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నిరసనలతో కదం తొక్కింది. దీంతో.. బీఆర్‌ఎస్ జంగ్ సరైన్ మోగించింది. ఈనెల 8న ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది.
సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ధర్నాలకు పిలుపునిచ్చారు మంత్రి కేటీఆర్. బొగ్గు బావుల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ నేతలకు కేటీఆర్ తెలిపారు. మంచిర్యాల, భూపాలపల్లి, కొత్తగూడెం, రామగుండం కేంద్రాల్లో మహా ధర్నాలు చేపట్టాలని బీఆర్ఎస్ నేతలకు మంత్రి కేటీఆర్ తేల్చిచెప్పారు. సింగరేణిని ప్రైవేటీకరించబోమని 2022 నవంబర్ 12న.. రామగుండంలో ప్రధాని మోదీ మాట ఇచ్చి తప్పారని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. యూటర్న్ తీసుకున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి ప్రజాక్షేత్రంలో గుణపాఠం చెబుదామన్నారు. వేలం లేకుండా సింగరేణికి బొగ్గు గనులు కేటాయించాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు.