TS : ట్యాంక్ బండ్ మణిహారం.. 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం

Update: 2023-04-05 02:00 GMT

హైదరాబాద్ అంటే ఇప్పటి వరకు చార్మినార్, టాంక్ బండ్, హుస్సేన్ సాగర్ మధ్యలో నిలువెత్తు బుద్ధ విగ్రహం! కానీ ఇప్పుడు హుస్సేన్ సాగర్ తీరాన మణిహారంలా 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం సిద్ధమైంది. దేశంలోని అత్యంత ఎత్తైన ఈ విగ్రహాన్ని... ఈ నెల 14 న అంబేడ్కర్ జయంతి రోజున ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున జరపాలని డిసైడ్ అయింది కేసీఆర్‌ సర్కారు. అంబేడ్కర్ విగ్రహంతో జాతీయస్థాయిలో హైదరాబాద్ ఇమేజ్ పెరిగేలా ప్రణాళికలు వేస్తున్నారు. విగ్రహంతో పాటు అక్కడ నిర్మిస్తున్న రాక్‌ గార్డెన్‌, ల్యాండ్‌ స్కేపింగ్‌, ప్లాంటేషన్‌, మెయిన్‌ ఎంట్రన్స్‌, వాటర్‌ ఫౌంటెన్‌, సాండ్‌ స్టోన్‌ వర్క్స్‌, జీఆర్సీ, గ్రానైట్‌ ఫ్లోరింగ్‌, లిఫ్ట్‌, విగ్రహం వద్దకు చేరుకొనే మెట్లదారి, ర్యాంప్‌, బిల్డింగ్‌ లోపల ఆడియో విజువల్‌ రూమ్‌ పనులు పూర్తయ్యాయి. విగ్రహం నిర్మాణం కోసం 791 టన్నుల స్టీల్, 96 మెట్రిక్ టన్నుల ఇత్తడిని ఉపయోగించారు. దాదాపు 150 కోట్ల రూపాయలతో ఈ విగ్రహ నిర్మాణాన్ని చేపట్టారు.

125 అడుగుల ఎత్తులో నిర్మించిన డా. బిఆర్ అంబేడ్కర్ మహా విగ్రహాన్ని, శోభాయమానంగా.. తెలంగాణ సమాజంతో పాటు యావత్ దేశ ప్రజలు సంబురపడేలా గొప్పగా ఆవిష్కరించనున్నారు. విగ్రహావిష్కరణను అత్యంత వైభవోపేతంగా, చారిత్రాత్మక వేడుకగా, కన్నుల పండుగగా దేశం గర్వించే రీతిలో జరపనున్నారు. ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా పూలజల్లు కురిపిస్తూ భారత రాజ్యాంగ నిర్మాతకు ఘనమైన రీతిలో పుష్పాంజలి ఘటించాలని ప్లాన్‌ చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి బౌద్ధ భిక్షువులను మాత్రమే ఆహ్వానించి వారి సాంప్రదాయ పద్దతిలోనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. విగ్రహావిష్కరణ కార్యక్రమానికి అంబేడ్కర్‌ ముని మనుమడు ప్రకాశ్ అంబేడ్కర్‌ను మాత్రమే ముఖ్య అతిథిని ఆహ్వానించారు. దేశం గర్వించదగ్గ స్థాయిలో విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటున్న సందర్భంలో ఆవిష్కరణ సభ కూడా అంతే ఉన్నత స్థాయిలో, అంబేడ్కర్ ఔన్నత్యాన్ని మరింత గొప్పగా ప్రపంచానికి చాటి చెప్పేలా ఉండాలని అధికారుల్ని ఆదేశించారు సీఎం కేసీఆర్‌.

ఈ నెల 14న మధ్యాహ్నం 2 గంటలకు సభ ప్రారంభమై 5 గంటలకు ముగుస్తుంది. బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లు తదితర అంశాల పై సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా దేశవ్యాప్తంగా అంబేడ్కర్‌ అభిమానులు, సామాజిక వేత్తలు, సామాన్యులు సందర్శనకోసం వస్తారని, ఈ సందర్భంగా నివాళులర్పించేందుకు విగ్రహ ప్రాంగణంలో పలు రకాల పుష్పాలను అందుబాటులో వుంచాలని తెలిపారు. విగ్రహ రూపశిల్పి మహారాష్ట్రకు చెందిన రామ్ వంజీ సుతార్‌ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఘనంగా సత్కరించనున్నారు. ఎండాకాలం కావడంతో నీడ కోసం టెంట్లు ఏర్పాటు చేయాలని, మంచినీరు, మజ్జిగ ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ ఏర్పాట్లన్నీ మరో నెల రోజుల పాటు కొనసాగించాలని మంత్రులను, అధికారులను సీఎం ఆదేశించారు. విగ్రహావిష్కరణ సభకు ప్రతి నియోజకవర్గం నుంచి 300 మంది చొప్పున మొత్తం 119 నియోజకవర్గాల నుంచి 35వేల 7వందల మంది హాజరయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి దేశంలోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా... జాతీయ స్థాయిలో హైదరాబాద్ బ్రాండ్ మారుమోగేలా ఆవిష్కరణ కార్యక్రమానికి ప్లాన్‌ చేస్తోంది కేసీఆర్‌ సర్కారు. 

Similar News