TS Assembly Elections: ముగిసిన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ
772 సెట్ల నామినేషన్ల తిరస్కరణ;
శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు సమర్పించిన నామినేషన్ల పరిశీలన ముగిసింది. కొన్ని నియోజకవర్గాల్లో పెద్దసంఖ్యలో నామినేషన్లు దాఖలు కావటంతోపాటు కొందరి నామినేషన్లపై ప్రత్యర్థుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. వాటిపై నిర్ణయం వెలువరించటానికి అధికారులకు ఎక్కువ సమయం పట్టింది. పరిశీలన ప్రక్రియ సోమవారం రాత్రి పొద్దుపోయేదాకా కొనసాగింది. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు 4 వేల 798 మంది నామినేషన్లు వేశారు. వాటిలో 608 మంది అభ్యర్థుల నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. నాగార్జునసాగర్‌లో మాజీ మంత్రి జానారెడ్డి, కోరుట్లలో ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు, మిర్యాలగూడలో మాజీ ఎమ్మెల్యే రేపాల శ్రీనివాస్, హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్ భార్య జమున వేసిన నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ఆ వివరాలను ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
శాసనసభ ఎన్నికల్లో నిబంధనల ప్రకారం ఒక్కో అభ్యర్థి రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు మించి పోటీ చేయకూడదు. నాలుగు సెట్లకు మించి నామినేషన్లు దాఖలు చేయరాదు. కానీ ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు రెండు కన్నా ఎక్కువ స్థానాల్లో నామినేషన్లు వేశారు. సపవత్ సుమన్ అనే అభ్యర్థి స్వంతంత్ర అభ్యర్థిగా 4 నియోజకవర్గాల్లో ఆరు సెట్ల నామినేషన్లు వేశారు. మహ్మద్ అక్రం అలీ ఖాన్, మహ్మద్ అబ్దుల్ అజీమ్ మూడేసి చోట్ల నామినేషన్లు వేశారు. ఈ తరహా నామినేషన్ల విషయంలో అన్ని రకాల నిబంధనలు పరిశీలించి, కేంద్ర ఎన్నికల సంఘాన్ని సంప్రదించాల్సి వచ్చింది. సదరు అభ్యర్థులు మొదట దాఖలు చేసిన నామినేషన్లను పరిగణలోకి తీసుకోవాలని నిర్ణయించారు. నామినేషన్ వేసిన తేదీ, సమయాన్ని పరిశీలించి మొదటి రెండు నియోజకవర్గాల్లోని నామినేషన్లను ఆమోదించినట్లు అధికారులు తెలిపారు.
ఖమ్మం భారాస అభ్యర్థి, మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సమర్పించిన అఫిడవిట్ నిబంధనల మేరకు లేదంటూ కాంగ్రెస్ పార్టీ లేవనెత్తిన అభ్యంతరాలను అధికారులు తిరస్కరించారు. దేవరకద్రలో కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన మధుసూదన్‌రెడ్డికి రెండు నియోజకవర్గాల్లో ఓటు హక్కు ఉందంటూ భారాస అభ్యంతరం తెలిపింది. రెండో ఓటు రద్దు చేయాలంటూ ఆయన దరఖాస్తు చేసుకుని ఉండటంతో నామినేషన్‌ను అధికారులు ఆమోదించారు.
పాలకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి యశస్వినికి మూడు వేర్వేరు చిరునామాలు ఉన్నాయంటూ భారాస ప్రతినిధులు అభ్యంతరం తెలిపారు. నిబంధనల మేరకు అలా చిరునామాలు ఉండవచ్చంటూ అభ్యంతరాలను అధికారులు తోసిపుచ్చారు. అలంపూర్ భారాస అభ్యర్థి విజయుడు ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగానికి రాజీనామా చేయకుండానే నామినేషన్ వేశారన్న అభ్యంతరాలనూ అధికారులు పరిగణనలోకి తీసుకోలేదు. రాష్ట్రవ్యాప్తంగా 8 మంది బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థుల నామినేషన్లు వివిధ కారణాల వల్ల తిరస్కరణకు గురయ్యాయి.