TSRTC: తెలంగాణలో మరోసారి ఆర్టీసీ ఛార్జీల మోత.. నేటి నుంచే..
TSRTC: ఇప్పటికే ధరాఘాతంలో అల్లాడుతున్న సామాన్యుడికి తెలంగాణ ప్రభుత్వం షాక్ ఇచ్చింది;
TSRTC: ఇప్పటికే ధరాఘాతంలో అల్లాడుతున్న సామాన్యుడికి తెలంగాణ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. తెలంగాణలో మరోసారి సెస్ రూపంలో ఆర్టీసీ ఛార్జీల మోత మోగించింది. కిలోమీటర్ వారీగా పెంచిన డీజీల్ సెస్‌ను వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నేటి నుంచి గ్రేటర్ పరిధిలో మినహా అన్ని రకాల ఆర్టీసీ బస్సులో అదనపు డీజీల్ సెస్ వసూలు చేయనున్నారు. పల్లె వెలుగులో 250 కిలోమీటర్లకు 5 రూపాయల నుంచి 45 రూపాయలు పెంచారు. ఇక ఎక్స్‌ప్రెస్ బస్సులో 500 కిలోమీటర్లకు 5 రూపాయల నుంచి 90 రూపాయలకు పెంచారు.
డీలక్స్‌లో 500 కిలోమీటర్లకు 5 రూపాయల నుంచి 125 రూపాయలకు పెంచగా.. సూపర్ లగ్జరీలో 500 కిలోమీటర్లకు 10 రూపాయల నుంచి 130 రూపాయలకు పెంచారు. ఏసీ బస్సుల్లో 500 కిలోమీటర్లకు 10 రూపాయల నుంచి 170 రూపాయలు పెంచింది తెలంగాణ ఆర్టీసీ. అయితే తక్కువ దూరం ప్రయాణించే వారిపై భారం పడకుండా స్లాబ్‌లు విధించారు. ఇక.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో డీజిల్ సెస్ పెంపులేదని ప్రకటించింది టీఎస్‌ఆర్టీసీ. దీంతో గ్రేటర్ బస్సుల్లో ప్రయాణీకులపై ఎలాంటి ప్రభావం ఉండదు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి అదనపు డీజిల్ సెస్ అనివార్యమని ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు.
గతంలో రౌండప్, టోల్ ప్లాజాలు, ప్యాసింజర్స్ సెస్ పేరిట ఒకసారి ఛార్జీలు పెంచిన ఆర్టీసీ మరోసారి ఏప్రిల్‌లో డీజిల్ సెస్ పేరుతో ప్రయాణికులపై భారం మోపింది. పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ సర్వీసులలో ఒక్కో ప్రయాణికుడి నుంచి డీజిల్ సెస్ కింద రెండు రూపాయలు, ఎక్స్ ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ, సిటీ మెట్రో ఎక్స్‌ప్రెస్, మెట్రో డీలక్స్, ఏసీ సర్వీసులలో 5 రూపాయల చొప్పున పెంచింది. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలంటుతున్నాయి. పెట్రోల్, డీజీల్, వంటగ్యాస్, వంటనూనెల రేట్లు మండిపోతున్నాయి. ఇక కూరగాయలైతే కొనేటట్టు లేదు. వీటికి తోడు ఇప్పుడు ఆర్టీసీ ఛార్జీలు పెంచితే తాము ఎలా బతకాలని సామాన్య ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.