Maoist Leaders Surrender : తెలంగాణలో మరో ఇద్దరు మావోయిస్టు కీలక నేతల లొంగుబాటు
తెలంగాణలో మావోయిస్టుల లొంగుబాటు ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా మరో ఇద్దరు కీలక మావోయిస్టు నేతలు తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో జననాట్య మండలి వ్యవస్థాపకుడు సంజీవ్ (అలియాస్ లెంగు దాదా) మరియు ఆయన భార్య దీనా (అలియాస్ పెరుగూల పార్వతి లేదా బొంతల పార్వతి) ఉన్నారు. వీరు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఎదుట లొంగిపోయినట్లు సమాచారం. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు సీపీ వారిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. విప్లవ గాయకుడు గద్దర్ తో కలిసి జననాట్య మండలిని స్థాపించిన వారిలో సంజీవ్ కూడా ఒకరు. ఆయన దండకారణ్యం స్పెషల్ జోనల్ సెక్రటరీగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. గత 25 ఏళ్లుగా దండకారణ్య ప్రాంతంలో వీరు మావోయిస్టు కార్యకలాపాలలో చురుగ్గా పాల్గొన్నారని తెలుస్తోంది. సంజీవ్ భార్య దీనా కూడా దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ (DKSZC)లో కీలక పదవులు నిర్వహించారు. ఈ లొంగుబాటు మావోయిస్టు పార్టీకి ఒక పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పునరావాస పథకాలు, "పోరు కన్నా ఊరు మిన్న, మన ఊరికి తిరిగి రండి" వంటి అవగాహన కార్యక్రమాలు మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసేందుకు దోహదపడుతున్నాయని అధికారులు పేర్కొంటున్నారు.