TS: నేడు అసెంబ్లీలో రెండు చరిత్రాత్మక బిల్లులు
వర్గీకరణ బిల్లుకు నేడే ఆమోదం... ఎస్సీ వర్గీకరణ చట్టబద్దత;
తెలంగాణలో సామాజిక వర్గాల సంక్షేమాన్ని కాంక్షిస్తూ రెండు చారిత్రాత్మక బిల్లులను నేడు అసెంబ్లీలో రేవంత్ సర్కార్ ప్రవేశపెట్టనుంది. బీసీలకు విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో రిజర్వేషన్లను 42 శాతానికి పెంచడంతో పాటు ఎస్సీల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించనుంది. వీటికి ఇప్పటికే కేబినెట్ ఆమోదం తెలపడంతో బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. ఎస్పీ వర్గీకరణ బిల్లును ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, బీసీ బిల్లును మంత్రి పొన్నం ప్రభాకర్.. శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి.. రిజర్వేషన్ల విషయంలో ఇప్పటికే స్పష్టత ఉండడంతో ఆ బిల్లుపై సోమవారమే చర్చించి, ఆమోదించే అవకాశం కూడా ఉంది.
ఎస్సీ వర్గీకరణ ఇలా...
ఎస్సీల వర్గీకరణ కోసం ఏర్పాటైన ఏకసభ్య కమిషన్ రాష్ట్రంలోని 59 ఎస్సీ కులాలను మూడు గ్రూపులుగా వర్గీకరించి ఆయా గ్రూపుల వారీగా 15 శాతం రిజర్వేషన్‌ను కేటాయించింది. గ్రూప్-1లో సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, అత్యంత వెనుకబడిన, పట్టించుకోని కులాలను చేర్చి, వారికి 1 శాతం.. గ్రూప్-2లో మధ్యస్థంగా లబ్ధిపొందిన షెడ్యూల్ కులాలను చేర్చి, వారికి 9 శాతం, గ్రూప్-3లో మెరుగైన ప్రయోజనం పొందిన కులాలను చేర్చి, వారికి 5 శాతం రిజర్వేషన్లను కేటాయించి, నివేదికను ప్రభుత్వానికి అందించింది. ఆ వర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వం చట్టబద్ధత కల్పించనుంది. తద్వారా ఆయా వర్గాలన్నింటికీ మేలు జరుగుతుందని సర్కారు భావిస్తోంది. అంతేకాదు.. ఎస్సీ వర్గీకరణ విషయంలో రాష్ట్రాలే నిర్ణయాలు తీసుకోవచ్చంటూ సుప్రీంకోర్టు తీర్పు తరువాత దానిని అమలుచేసిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలవనుంది. వర్గీకరణ బిల్లును సభలో ప్రవేశపెట్టిన అనంతరం ఈ అంశాలతో పాటు మరికొన్నింటిపైనా చర్చించనున్నారు.
బీసీ రిజర్వేషన్ బిల్లు
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా నేడు బీసీ రిజర్వేషన్ బిల్లును కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. బీసీలకు 42 శాతం విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేయనున్నారు. ఇందుకు అవసరమైన బిల్లులను సభలో ప్రవేశపెడతారు. అనంతరం బిల్లులను సభ ఆమోదిస్తుంది. కాగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలో భాగంగా బిల్లును ప్రవేశపెడుతుంది.