సీఎం చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ భవన్లో జరిగిన పార్టీ శిక్షణ తరగతులకు హాజరయ్యారు. నాలుగోసారి సీఎం అయినా సామాన్య కార్యకర్తలా నేతల మధ్య కూర్చుని పార్లమెంట్ కమిటీ వర్క్షాప్ను ఫాలో అయ్యారు. నూతనంగా ఎంపికైన పార్లమెంట్ అధ్యక్షులకు మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు పాఠాలు బోధించారు. ఈ క్లాసులకు టీడీపీ జాతీయ అధినేత స్వయంగా తరగతులకు హాజరై కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు.
టీడీపీ బలం.. బలగం కార్యకర్తలేనని రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పార్లమెంట్ కమిటీ వర్క్ షాప్ లో ఆయన మాట్లాడుతూ మాజీ సీఎం ఎన్టీఆర్ ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో కానీ.. దేశంలో ఏ పార్టీకి లేని కార్యకర్తలు ఒక్క తెలుగుదేశానికే సొంతం అన్నారు. పుంగనూరు నియోజకవర్గంలో నామినేషన్ వేసేందుకు వెళితే పత్రాలు లాక్కున్నా కూడా మీసాలు మెలేసి, తొడగొట్టిన అంజిరెడ్డి తాత తనకు స్ఫూర్తి అన్నారు. మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ నాయకుల దాడిలో గాయపడి రక్తమోడుతున్నా చివరి ఓటు పడే వరకు పోలింగ్ బూత్ లో తెగువ చూపిన మంజుల, విజయవాడలో వైసీపీ గూండాల దాడిలో కంటిచూపు కోల్పోయినా జై తెలుగుదేశం అని నినదించిన చెన్నుపాటి గాంధీ తనకు ఆదర్శమన్నారు. మెడపై కత్తిపెట్టి తమ నాయకుడి పేరు చెప్పమంటే.. జై చంద్రబాబు, జై టీడీపీ అని నినదించి ప్రాణాలు కోల్పోయిన తోట చంద్రయ్య తనకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. పేదరికం లేని సమాజం కోసం మన ప్రభుత్వం పని చేస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ అన్నారు. అన్ని పదవుల్లో సామాజిక న్యాయం పాటించాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పారు. పార్టీలో మహిళలను గౌరవించాలని సూచించారు. అందరిలో స్ఫూర్తి రగలించాలన్నారు.