ప్రజలకు అంతరాయం లేకుండా కరెంట్ అందిస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. భవిష్యత్‌లో డిమాండ్‌కు తగ్గట్లుగా విద్యుత్ ఇచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గతేడాది మార్చి 24న 308.45 మిలియన్ యూనిట్ల కరెంట్ సరఫరా చేయగా.. ఈ ఏడాది 18 మార్చిన 335 మిలియన్ యూనిట్ల విద్యుత్ ను సరఫరా చేసినట్లు తెలిపారు. రాష్ట్ర చరిత్రలో ఇదే అత్యధికమని భట్టి చెప్పారు. గత ఏడాది మార్చి 8న 15,497 మెగావాట్ల హైడిమాండ్ ఏర్పడగా.. ఈ ఏడాది మార్చి 20న 17,162 మెగావాట్ల డిమాండ్ ఏర్పడిందని చెప్పారు. సుమారు 2000 మెగావాట్ల అదనపు డిమాండ్ ఉన్నప్పటికీ సెకన్ కూడా విద్యుత్ అంతరాయం లేకుండా సరఫరా చేస్తున్నట్లు తెలిపారు.
గత ఐదేళ్లుగా రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరుగిందని భట్టి తెలిపారు. పెరుగుతున్న విద్యుత్ అవసరాల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు భట్టి సూచించారు. విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా కొత్త సబ్ స్టేషన్లను నిర్మించాలని ఆదేశించారు. కొత్త సబ్ స్టేషన్ నిర్మిస్తున్న ప్రాంతంలో భూమి కోల్పోయిన వారికి ఉద్యోగాలు కల్పించడంపై దృష్టి సారించాలన్నారు.
అంతేకాకుండా హైదరాబాద్ మహానగరంలో అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కేబుల్స్ నిర్మాణం కొరకు పూర్తిస్థాయిలో డీపీఆర్ సిద్ధం చేయాలని అధికారులను భట్టి విక్రమార్క ఆదేశించారు. ట్రాన్స్ ఫార్మర్ల ఏర్పాటుకు స్థలం కొరత నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న 12.5 మిలియన్ యూనిట్ల ట్రాన్స్ ఫార్మర్ల స్థానంలో 16 మిలియన్ యూనిట్ల పవర్ ట్రాన్స్ ఫార్మర్ల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని చెప్పారు. రెన్యూవబుల్ ఎనర్జీపై పూర్తిగా దృష్టి సారించాలని అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని సూచించారు.