BANDI: మాటల్లేవ్.. మాట్లాడుకోడాల్లేవ్

కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు... ఆపరేషన్ కగార్ అగబోదని స్పష్టీకరణ;

Update: 2025-05-05 04:30 GMT

ఆపరేషన్ కగార్ పై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టులపై చర్చలు జరపాలని.. ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని కాంగ్రెస్, బీఆర్ఎస్ సహా పలు పార్టీలు ఎన్డీయే ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కొన్ని పార్టీల నేతలు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు లేఖలు సైతం రాశారు. దీనిపై బండి సంజయ్ స్పందించారు. కగార్ ఆపేదే లేదని, మావోయిస్టులతో మాటల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవ్ అంటూ కేంద్ర మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ లోని కొత్తపల్లిలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ హనుమాన్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కొత్తపల్లిలో బండి సంజయ్ మాట్లాడుతూ.. మావోయిస్టులతో చర్చల ప్రసక్తే లేదని బండి సంజయ్ తేల్చి చెప్పారు. తుపాకీ చేతపట్టి అమాయకులను పొట్టన పెట్టుకున్నోళ్లతో ఎలాంటి చర్చలు ఉండవని బండి సంజయ్ చెప్పేశారు. మావోయిస్టులను నిషేధించిందే కాంగ్రెస్ ప్రభుత్వమన్న బండి... గతంలో మందుపాతరలు పెట్టి కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ సహా ఎంతో మంది నేతలను చంపినోళ్లు నక్సల్స్ కాదా అని నిలదీశారు.

తుపాకీ విడకపోతే చర్చలే ఉండవు

అమాయక గిరిజనులను ఇన్ ఫార్మర్ల నెపంతో అన్యాయంగా కాల్చి చంపి ఎన్నో కుటుంబాలకు మానసిక క్షోభ మిగిల్చినోళ్లు మావోయిస్టులు. వాళ్లు తుపాకీ వీడనంత వరకు మావోయిస్టులతో చర్చల ఊసే ఉండదని బండి సంజయ్ వెల్లడించారు. "మావోలతో చర్చలు జరిపే ప్రసక్తే లేదు.. నక్సల్స్ హింసలో ఎందరో లీడర్లు చనిపోయారు... పోలీసులు చనిపోయారు... అప్పుడు చర్చల గురించి.. మావోయిస్టులకు మద్దతుగా కేసీఆర్, రేవంత్ ఎందుకు మాట్లాడలేదు.. " అని బండి సంజయ్ వెల్లడించారు. ఆపరేషన్ కగార్ ఆపాల్సిందే. ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసీలపై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న హింసను ఆపివేయాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుందెబ్బ) వ్యవస్థాపకులు బుర్స పోచయ్య డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం నక్సల్స్ ఏరివేత పేరుతో అమాయక ఆదివాసీ గిరిజనులను బలి చేస్తోందన్నారు. ఆ ప్రాంతంలో విలువైన ఖనిజాలు, నిక్షేపాలను దోచుకోవడానికే ప్రభుత్వం ఈ చర్యలు చేపడుతుందని ఆరోపించారు.

కొనసాగుతున్న ఆపరేషన్ కగార్

ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో విస్తరించిన కీకారణ్యంలో మావోయిస్టుల స్థావరాల గుర్తింపు లక్ష్యంగా భద్రతా బలగాలు ముందుకు సాగుతున్నాయి. ఆపరేషన్ కగార్లో భాగంగా అడవుల్లో జల్లెడ కొనసాగింది. ముఖ్యంగా కర్రెగుట్టలపై కేంద్ర బలగాలు డేగకన్ను వేశాయి. బలగాలకు అవసరమైన ఆహారం, తాగునీరు, ఆయుధాలు, ఐఈడీల నిర్వీర్యానికి అవసరమైన సామగ్రిని ములుగు జిల్లా వెంకటాపురం కేంద్రంగా సరఫరా చేస్తున్నారు.

Tags:    

Similar News