అకాల వర్షాల కారణంగా 14,956 ఎకరాల విస్తీర్ణంలో పంట నష్టం వాటిల్లిందని వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి తెలిపింది. వాటిలో వరి, మొక్కజొన్న, మామిడి సహా పలు రకాల పంటలున్నాయని పేర్కొంది. ఒక్క గత నెలలో వానలకే 8408 ఎకరాల పంట నేలవాలిందని పేర్కొంది. ఈ నెల 3 నుంచి 9 వరకు 7 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో కురిసిన వానలు చేకూర్చిన నష్టంపై రూపొందించిన నివేదికను వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి సమర్పించింది.
అకాల వర్షాలకు చేతికొచ్చిన పంట నాశనమవడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, జనగామ, సిద్దిపేట, మహబూబ్‌నగర్, నిర్మల్ జిల్లాల్లో మామిడి కాయలు, వరి, మొక్కజొన్న, మిర్చి, జొన్న పంటలు నేలకూలాయి. ములుగు జిల్లా మెట్లగూడెంలో 15 ఎకరాల పంట నష్టపోవడంతో రైతు నర్సింహారావు పురుగుమందు తాగారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. వేర్వేరు చోట్ల పిడుగులు పడి ముగ్గురు మృతి చెందారు.
రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాల్లో ఈ మూడు రోజులూ వడగళ్లు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడొచ్చని అంచనా వేసింది. ఈ మేరకు సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.