Minister Ponnam : బీసీ రిజర్వేషన్లపై బీజేపీ కుట్రలను తిప్పికొడతాం - మంత్రి పొన్నం
బీసీ రిజర్వేషన్ల అంశంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రిజర్వేషన్ల సాధన కోసం తుదివరకు పోరాడతామన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. గాంధేయ పద్ధతిలో పోరాడి అనుకున్నది సాధించి.. బీసీలకు న్యాయం చేస్తామన్నారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి లాంటి వారి కుట్రలను తిప్పికొడతామని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ చావుతప్పి కన్నులొట్టబోయిన చందంగా.. గెలిచిందని సెటైర్ వేశారు. ఉత్తరాదిలో చాలా రాష్ట్రాల్లో బీసీలు ఆ పార్టీని తిరస్కరించారని.. రిజర్వేషన్లు పెంచకపోతే బీజేపీ ఓటమి ఖాయమని చెప్పారు.
ముస్లింల పేరుతో బిల్లును అడ్డుకోవడం సరికాదని పొన్నం అన్నారు. బీసీ బిల్లుకు సంబంధించి కిషన్ రెడ్డి బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. బీసీలకు ఇచ్చిన హామీల అమలులో చిత్తశద్ధితో పనిచేస్తున్నట్లు తెలిపారు. కాగా ముస్లింలను తీసివేస్తేనే బీసీ బిల్లుకు మద్దతు ఇస్తామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ముస్లింలను చేర్చి బిసీలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. మతపరమైన రిజర్వేషన్లను బీజేపీ ప్రోత్సహిందని తెలిపారు.