Telangana: మండిపోతున్న ఎండలు

8 జిల్లాల్లో 45.5 డిగ్రీల ఉష్ణోగ్రతల;

Update: 2024-05-01 02:15 GMT

రాష్ట్రవ్యాప్తంగా భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. సూర్యప్రతాపానికి జీవజాతులు అల్లాడిపోతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పులతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు

రాష్ట్రం నిప్పుల కుంపటిని తలపిస్తోంది. ఈ ఏడాది మొదటిసారి 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే భానుడు ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తున్నారు. జగిత్యాల, నల్గొండలో 46.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కరీంనగర్‌ జిల్లా కొత్తగట్టులో 46, సిద్ధిపేట జిల్లా దూల్మిట్టలో 45.9, మంచిర్యాల జిల్లా జన్నారంలో 45.7, ములుగు జిల్లా మల్లూరులో 45.6 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వడగాల్పులకు రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది మంది మృతిచెందారు.

ఎండ వేడిమికి జనం అల్లాడిపోతున్నారు. రోజురోజుకు పెరిగిన ఉష్ణోగ్రతలతో... పగలు, రాత్రి వాతావరణం వేడిగా ఉంటోంది. గత ఏడాదితో పోల్చితే ఈ సమయానికి కొన్ని ప్రాంతాల్లో..ఐదు నుంచి 8 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగింది. పని మీద బయట తిరిగే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని స్వచ్చంద సంస్థలు చలివేంద్రాలు ఏర్పాటు చేసి... జనం దాహార్తిని తీరుస్తున్నాయి. ఏప్రిల్‌లోనే ఎండల తీవ్రత ఇలా ఉంటే, మే నెలలో పరిస్థితి ఏ విధంగా ఉంటుందోనని ప్రజలు భయపడుతున్నారు. మే నెలలో ఉష్ణోగ్రతలు 48 నుంచి 49 వరకు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో ఎండలకు తోడు వడగాల్పుల తీవ్రత అధికంగా ఉంటుంది. గత రెండు రోజులుగా తీవ్రమైన వడగాల్పులు వీచాయి. మరో 5 రోజుల పాటు వడగాల్పుల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. వృద్ధులు, చిన్న పిల్లలపై ఉష్ణోగ్రతలు, వడగాల్పుల ప్రభావం అధికంగా ఉంటుందని తెలిపింది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు బయటకు రావద్దని హెచ్చరించింది. అత్యవసర పరిస్థితుల్లో రావాల్సి వస్తే తగు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు హెచ్చరించారు. తలపై ఎండ తగలకుండా ఉండేందుకు గొడుగు, నిమ్మరసం, కొబ్బరి నీళ్లు, గ్లూకోజ్ నీళ్లను వెంట తీసుకోవాలని సూచిస్తున్నారు. ఎండ దెబ్బ వల్ల ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులతో పాటు ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.

ఎండ వేడిమికి పెట్రోల్‌ బంకుల్లో.. అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని సామాజిక మాధ్యమాల్లో వస్తున్న దుష్ర్రచారంతో.. జనం జంకుతున్నారు. ఎండలో విధులు నిర్వర్తించే వారు విలవిల్లాడుతున్నారు. కరీంనగర్‌లోని ఓ పెట్రోల్ బంకు యజమాని వినూత్నంగా ఆలోచించి.. స్ప్రింక్లర్లు ఏర్పాటు చేశారు. 

మే నెలలో 48 నుంచి 49డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వారంపాటు వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావొద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 

Tags:    

Similar News