బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వ వ్యూహం ఏంటి.. ఎట్టి పరిస్థితుల్లో రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తుందా.. లేదంటే జీవోను రద్దు చేసి పాత పద్ధతిలోనే వెళ్తుందా. హైకోర్టులో ఆరు వారాల దాకా స్టే వచ్చింది. రెండు వారాల తర్వాత కౌంటర్ వేయాల్సి ఉంది. ఇంకోవైపు ఎన్నికల కమిషన్ ఇచ్చిన నోటిఫికేషన్ ను నిలిపివేసింది. కొత్త నోటిఫికేషన్ వచ్చేదాకా ఎన్నికలు జరిగే పరిస్థితి లేదు. చట్ట పరంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్ల కోసం జీవోను చెల్లించుకోవాలంటే లీగల్ గానే వెళ్లాలి తప్ప మరో మార్గం లేదు కాంగ్రెస్ ప్రభుత్వానికి. దీని కోసం అవసరం అయితే సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు ఆలోచిస్తోంది ప్రభుత్వం.
హైకోర్టు ఇచ్చిన స్టేను ఎత్తివేయాలంటూ సుప్రీంను కోరే అవకాశాలు ఉన్నాయి. లేదంటే ఎన్నికలు వాయిదా వేస్తుందా అనే ప్రచారం కూడా ఉంది. కానీ ఇప్పటికే స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగక రెండేళ్లు కావస్తోంది. గ్రామాల్లో ఎక్కడి పనులు అక్కడ ఆగిపోయాయి. సర్పంచులు లేకపోవడంతో కేంద్రం నుంచి పంచాయతీలకు నిధులు కూడా రావట్లేదు. కాబట్టి ఇంకా ఆలస్యం చేస్తే ప్రభుత్వం మీద నెగెటివిటీ పెరుగుతుంది. కానీ మంత్రులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామంటున్నారు. కానీ అది సాధ్యం కావాలంటే సరైన రూట్ కనిపించట్లేదు. పోనీ పాత పద్ధతిలోనే నోటిఫికేషన్ ఇచ్చి పార్టీ పరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం మరో మార్గం.
అలా చేసినా కాంగ్రెస్ కు పెద్ద ఇబ్బందేమీ కాదు. తాము చేయాల్సిందంతా చేశాం.. వీలు కాలేదు కాబట్టే పార్టీ పరంగా ఇస్తున్నాం అని చెప్పుకోవచ్చు. ప్రతిపక్ష పార్టీలు ఇవ్వాలని డిమాండ్ కూడా చేయొచ్చు. ఒకవేళ ప్రతిపక్షాలు ఇవ్వకపోతే అది కాంగ్రెస్ పార్టీకి పెద్ద అడ్వాంటేజ్ అవుతుంది. ఈ విధమైన వ్యూహం బాగానే ఉన్నా.. బీసీ సంఘాల నుంచి ఒత్తిడి రావడం తప్పదు. మేనిఫెస్టోలో ఇచ్చారు కాబట్టి హామీ నెరవేర్చలేదని కాంగ్రెస్ ను ప్రతిపక్షాలు టార్గెట్ చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది. ఈ చిక్కుల్లో నుంచి ఎలా బయటపడుతుంది అనేది తెలియడానికి మరో రెండు రోజులు పట్టేలా ఉంది.