Miss World Allegations : మిస్ వరల్డ్ పోటీల్లో అసలు వివాదం ఎక్కడ మొదలైందంటే?
మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా హైదరాబాద్ వచ్చినప్పుడు, కొందరు సంపన్న పురుష స్పాన్సర్లను అలరించాలంటూ తనపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారని ఇంగ్లండ్ మిస్ వరల్డ్ కంటెస్టెంట్ మిల్లా మాగీ ఆరోపించారు. ఈ ఆరోపణలు ఇంగ్లండ్ మీడియాలో ప్రచురితం కావడంతో వివాదం రాజుకుంది. "మేం పోటీల కోసం వచ్చామో, దేనికోసం వచ్చామో అర్థం కాలేదు. ఇవేం పోటీలు?" అంటూ ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు కథనాలు వెలువడ్డాయి. తెలంగాణ ఆతిథ్యం బాగుందని చెబుతూనే, నిర్వాహకుల తీరుపై ఆమె అభ్యంతరాలు లేవనెత్తారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆమె పోటీల నుంచి అర్ధాంతరంగా వైదొలిగి స్వదేశానికి వెళ్లిపోయారు. ఈ ఆరోపణలు తెలంగాణ వ్యాప్తంగా రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ఈ పరిణమాల నేపథ్యంలో రేవంత్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది.
హైదరాబాద్ లో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ తీరుపై మిస్ ఇంగ్లండ్ మిల్లా మాగీ చేసిన తీవ్ర ఆరోపణలు కలకలం రేపాయి. విపక్ష పార్టీల నేతలు ఈ అంశాన్ని రాజకీయం చేస్తూ ప్రభుత్వంపై బురదజల్లారు. ఈ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం తక్షణమే స్పందించి, ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించింది. దేశ ప్రతిష్ఠతో ముడిపడి ఉన్న ఈ అంశాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.