రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా, సీఎం రేవంత్ రెడ్డికి ఆ విషయాలపై పట్టింపు లేనట్లుగా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. ఇవాల సిరిసిల్లలోని వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ఒకవైపు రాష్ట్రంలో వరదలు ముంచెత్తుతుంటే, రేవంత్ రెడ్డి మాత్రం మూసీ నది సుందరీకరణ, ఒలింపిక్స్ క్రీడల గురించి సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇది ప్రభుత్వ ప్రాధాన్యతలకు అద్దం పడుతోంది’’ అని కేటీఆర్ విమర్శించారు. ప్రభుత్వం పనిచేయకపోయినా, అధికారులు, పోలీసులు మాత్రం అప్రమత్తంగా ఉండి ప్రజలకు సహాయం చేస్తున్నారని ఆయన అన్నారు.
ఆర్థిక సహాయం డిమాండ్
ఈ సందర్భంగా కేటీఆర్ వరద బాధితులకు తక్షణ సహాయం అందించాలని డిమాండ్ చేశారు. వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.25 లక్షల చొప్పున పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే వరదల కారణంగా పంట నష్టపోయిన రైతులందరికీ ఎకరాకు రూ.25 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.