అజారుద్దీన్ కు మంత్రి పదవి.. జూబ్లీహిల్స్ దక్కుతుందా.

Update: 2025-10-30 12:22 GMT

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఇప్పుడు తెలంగాణలో అత్యంత కీలకంగా మారిందని ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తేనే తెలుస్తుంది. ఈ ఒక్క ఉప ఎన్నిక మూడు పార్టీల భవిష్యత్తును నిర్ణయిస్తుందన్న రేంజ్ లో మూడు పార్టీలు వ్యూహాలు కదుపుతున్నాయి. కొన్ని వర్గాల ఓట్ల కోసం ఆ వర్గాలకు చెందిన నేతలను భారీ స్థాయిలో హామీలు ఇచ్చి మరి గులాబీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు చేర్చుకుంటున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ అంతకుమించిన ఓ డేరింగ్ స్టెప్ తీసుకుంది. ఏకంగా అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇచ్చేసింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మైనార్టీ ఓట్లు చాలా బలమైన ప్రభావం చూపిస్తాయని అందరికీ తెలిసిందే.

అందుకే ఎన్నిక దగ్గర పడుతున్న వేళ అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇచ్చేశారు. వాస్తవానికి జూబ్లీహిల్స్ టికెట్ అజారుద్దీన్ కు ఇస్తారనే ప్రచారం ముందు నుంచి జరిగింది. కానీ ఎమ్మెల్యే టికెట్ కాకుండా.. ఎమ్మెల్సీనీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ ఇప్పుడు అది కూడా సరిపోదని అనుకుందేమో.. అందుకే ఏకంగా మంత్రి పదవి ఇచ్చేసింది. కాంగ్రెస్ లో ఎంతోమంది సీనియర్లు మంత్రి పదవి కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. మంత్రివర్గ విస్తరణలో తమకు కచ్చితంగా ఏదో ఒక శాఖ వస్తుందని కోటి ఆశలతో ఉన్నారు. ఇప్పటికే తమకు మంత్రి పదవి ఇవ్వట్లేదని చాలామంది మీడియా ముందు తన అసంతృప్తి వెళ్ళగక్కుతున్నారు. ఇలాంటి సమయంలో రేవంత్ రెడ్డి ఇంతటి భారీ డేరింగ్ స్టెప్ తీసుకోవడం అంటే జూబ్లీహిల్స్ ఎన్నికను ఎంత సీరియస్ గా తీసుకున్నారో అర్థం అవుతుంది.

కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పటివరకు ఒక్క మైనారిటీ వర్గానికి చెందిన మంత్రి కూడా లేడు. ఎలాగూ ఆ వర్గానికి ఒక మంత్రి పదవి ఇవ్వాల్సిందే కాబట్టి.. అదేదో ఇప్పుడే ఇస్తే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో తాము గెలుస్తామని ఆశతో రేవంత్ రెడ్డి ఉన్నారు. అందుకే ఎన్ని రకాల అడ్డంకులు వచ్చినా సరే ఎంతమంది నుంచి ఒత్తిడిలు వచ్చినా సరే వెనక్కు తగ్గకుండా అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇచ్చేశారు. ఈ ఎన్నికల్లో గెలిస్తే తమ మీద ఎలాంటి వ్యతిరేకత లేదని.. గ్రేటర్ లో తమ పట్టు ఇంకా పెరిగిందని ప్రచారం చేసుకోవచ్చు. పైగా ఇదే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాన్ని రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బలంగా వాడుకోవచ్చు. ఆ తర్వాత వచ్చే గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల్లోనూ తమకు తిరుగు ఉండదని కాంగ్రెస్ భావిస్తోంది. అందుకే ఇప్పుడు అజారుద్దీన్ ను కేబినెట్లోకి తీసుకుంది. మరి అజారుద్దీన్ కు ఇచ్చిన ఇంత పెద్ద పదవి జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్కు గెలుపును తెచ్చి పెడుతుందా లేదా చూడాలి.

Tags:    

Similar News