TS: తెలంగాణ "రైజింగ్"

దావోస్‌లో భారీగా పెట్టుబడులు... రూ. 1.78 లక్షల కోట్ల ఒప్పందాలు చేసుకున్న రేవంత్ సర్కార్;

Update: 2025-01-24 02:00 GMT

దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వేదికపై తెలంగాణ మరో కొత్త రికార్డు నమోదు చేసింది. గతంలో ఎన్నడూ లేనంత భారీ పెట్టుబడులను సమీకరించింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఇప్పటి వరకూ ఎన్నడూ లేని విధంగా ప్రపంచ ఆర్థిక సదస్సులో ఈసారి ఏకంగా రూ.1.78 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ సదస్సులో ఏకంగా లక్షా 78 వేల 950 కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడులు సాధించడమే కాకుండా.. కొత్త ఒప్పందాలతో 49 వేల 500మందికి ఉద్యోగాలు రానున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పెట్టుబడుల సాధనలో ఇదే అతి పెద్ద రికార్డు. ఈ సదస్సులో పదికిపైగా సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. గత ఏడాదితో పోలిస్తే మూడింతలు మించి పెట్టుబడులు ఆకర్షించింది రేవంత్ సర్కార్.

ఊహించిన దానికంటే ఎక్కువే..

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సుకు ‘తెలంగాణ రైజింగ్‌’ పేరుతో వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, మంత్రి శ్రీధర్‌ బాబు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్‌ రంజన్‌, ఇతర ఉన్నతాధికారుల బృందం ఊహించిన దానికంటే ఎక్కువ పెట్టుబడులు సాధించింది. గత ఏడాది తొలిసారిగా దావోస్‌ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తెలంగాణకు రూ.40,232 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అప్పటితో పోలిస్తే ఈసారి నాలుగు రెట్లకు మించి పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. ‘‘దావోస్‌ పర్యటనలో రూ.1.78 లక్షల కోట్ల ఒప్పందాలు కుదుర్చుకున్నాం. వీటితో 49,500 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఇది ‘బ్రాండ్‌ తెలంగాణ’ సాధించిన అద్భుతమైన విజయం’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.

రేవంత్ కీలక వ్యాఖ్యలు

తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ కంపెనీలు ఎంత ఆసక్తిగా ఉన్నాయో వీటినిబట్టి అంచనా వేయవచ్చని తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ ఒప్పందాలు సాధించడానికి శ్రమించిన ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు, ఇతర ఉన్నతాధికారులను ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధి, యువతకు ఉద్యోగాల కల్పన కోసం చేసిన ఈ పర్యటన ఎంతో సంతృప్తిని కలిగించిందని చెప్పారు. గత ప్రభుత్వంలా కేవలం ఒప్పందాలు కుదుర్చుకోవడం వరకే తాము పరిమితం కాబోమని, కుదుర్చుకున్న ఒప్పందాలన్నీ కార్యరూపం దాల్చేంతవరకు ప్రత్యేకంగా దృష్టి సారిస్తామని రేవంత్‌ రెడ్డి అన్నారు. వారం రోజులుగా సింగపూర్‌, దావోస్‌ పర్యటనల్లో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి బృందం తెలంగాణకు తిరిగి పయనమైంది. కాసేపట్లో ఈ బృందం హైదరాబాద్‌ చేరుకోనుంది.

Tags:    

Similar News