Sexual Harassment : మాదాపూర్‌లో హాస్టల్ ఓనర్‌పై మహిళల దాడి.. లైంగిక వేధింపులకు..
హైదరాబాద్ మాదాపూర్‌లోని ఎన్‌పీపీ ఎగ్జిక్యూటివ్ ఉమెన్స్ హాస్టల్‌లో లైంగిక వేధింపుల ఆరోపణలు కలకలం సృష్టించాయి. హాస్టల్ నిర్వాహకుడు సత్య ప్రకాష్‌పై దాడికి దిగిన మహిళలు, ఒక మైనర్ బాలికపై అతను లైంగిక దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. మాదాపూర్‌లోని ఇమేజ్ గార్డెన్ రోడ్డులో ఉన్న ఈ హాస్టల్‌లో ఒక 16 ఏళ్ల బాలిక నివాసం ఉంటున్నారు. హాస్టల్ నిర్వాహకుడు సత్య ప్రకాష్ ఆ బాలికను లైంగికంగా వేధించారని ఆరోపిస్తూ కొందరు మహిళలు హాస్టల్‌కి వెళ్లి పూలకుండీలను ధ్వంసం చేయడంతో పాటు, సత్య ప్రకాష్‌పై దాడి చేశారు.
పోలీసులు వెంటనే హాస్టల్‌కు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. పోలీసులు దాడికి పాల్పడిన మహిళలతో పాటు హాస్టల్ నిర్వాహకుడు సత్య ప్రకాష్‌ను మాదాపూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసుల విచారణలో సత్య ప్రకాష్ తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. మైనర్ బాలికపై ఎలాంటి లైంగిక దాడి జరగలేదని, తనను అక్రమంగా ఇరికించేందుకు కొందరు కుట్ర పన్నారని ఆయన ఆరోపించారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.