కర్ణాటకలో మంత్రులు సహా 48మంది ‘హనీ ట్రాప్’లో చిక్కుకున్నారంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. రాజకీయ ప్రయోజనాలకోసం విసిరిన వలపు వలల్లో జాతీయ స్థాయి నేతలు సైతం చిక్కుకున్నారని అసెంబ్లీలో మంత్రి కేఎన్ రాజన్న వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంపై ఉన్నతస్థాయి దర్యాప్తు చేయించాలని అటు అధికార, ఇటు విపక్ష నేతలు డిమాండ్ చేయడంతో దర్యాప్తు చేయిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అంతకుముందు ఇదే అంశంపై మంత్రి సతీశ్ జార్కిహోళీ మాట్లాడుతూ.. ఒక మంత్రిపై రెండుసార్లు హనీ ట్రాప్ యత్నం జరిగిన విషయం వాస్తవమేనన్నారు. అయితే, ఇది రాష్ట్రానికి కొత్త కాదని, రాజకీయ ప్రయోజనాల కోసం కొంతమంది వీటిని వాడుకుంటున్నారని అన్నారు. ఈ తరహా ఘటనలకు ముగింపు పలకాల్సిన అవసరం ఉందన్నారు. దీనిపై ఫిర్యాదు చేయాలని సదరు మంత్రికి సూచించామని, వెంటనే దర్యాప్తు మొదలు పెడతామన్నారు. మరోవైపు ఇదే వ్యవహారంపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందిస్తూ.. ఎవరినైనా అరెస్టు చేశారో లేదోనన్న విషయం తనకు తెలియదన్నారు. దర్యాప్తు పూర్తయితే అన్ని విషయాలు బయటకు వస్తాయన్నారు.