Flight Ticket: రూ. 13,820 టికెట్ క్యాన్సిల్ చేస్తే రూ. 20 రీఫండ్ !
ఐఏఎస్ అధికారికి వింత అనుభవం... టికెట్ రద్దు చేస్తే క్యాన్సలేషన్ ఛార్జీలు, కన్వీనియెన్స్ ఫీజులు, కాస్ట్ టు ఎయిర్‌లైన్ అంటూ రిఫండ్ లో భారీ కోత;
విమానాల్లో ప్రయాణించాలంటే ధరలు వేలల్లో ఉంటాయి. అయితే ఒక్కోసారి మనకు వద్దనుకుంటే బుక్ చేసుకున్న టికెట్లను క్యాన్సల్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ టికెట్లకు విమాన సంస్థలు తమ పాలసీలను బట్టి సొమ్మును ప్రయాణికులకు రిఫండ్(Refund) చేస్తుంటాయి.
అయితే ఒక ఐఏఎస్(IAS) అధికారి, ఈ రిఫండ్ విషయంలో తనకు ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. రూ. 13,820 ల విలువైన టికెట్‌ను రద్దు చేసుకుంటే, అన్ని ఛార్జెస్ పోనూ అతడికి రూ.20 మత్రమే వచ్చాయి.
Pls suggest some good investment plans for my refund. pic.twitter.com/lcUEMVQBnq
— Rahul Kumar (@Rahulkumar_IAS) July 10, 2023
ఈ సంఘటన విమానయాన సంస్థలు వసూలు చేసే రుసుములను తెలియజేస్తోంది. ఒక టికెట్‌ని రద్దు చేసుకుంటే క్యాన్సలేషన్ ఛార్జీతో పాటు, కన్వీనియెన్స్ ఫీజు, కాస్ట్ టు ఎయిర్‌లైన్ అంటూ ఇతర రుసుములు కలిపితే చివరికి ప్రయాణికుడికి దక్కేది కొంతే.
ఈ పోస్ట్ సోషల్ మీడియాలో 3 లక్షల వ్యూస్‌తో వైరలయింది. దీనిపై యూజర్లు తమకు నచ్చిన రీతిలో స్పందిస్తున్నారు.
"టైం మిషన్‌ని తయారుచేసుకుని, కాలంలో వెనక్కి వెళ్లి మనం ఎక్కువ ఖర్చు చేసి చింతించే వాటిని మళ్లీ చేయకుండా చేసుకోవాలి" అని ఇక యూజర్ కామెంట్ చేశాడు.
"ఎయిర్‌లైన్స్ అధికారిక యాప్, వెబ్‌సైట్ నుంచి మాత్రమే టికెట్లు బుక్ చేసుకోవడం మంచిది. ధర ఎక్కువగానే ఉంటున్నా, రిఫండ్ సమయంలో వారు థర్డ్ పార్టీ యాప్‌ల కంటే మెరుగ్గా రిఫండ్ చేస్తారు" అని మరో యూజర్ తెలిపాడు.
"తక్కువ ధరలకు టిక్కెట్లను విక్రయించే ఆన్‌లైన్ పోర్టళ్లు, క్యాన్సలేషన్ల రూపంలో భారీగా ఛార్జ్ చేస్తూ వాటిని తిరిగి వసూలు చేసుకుంటున్నారు. ఇది మంచిది కాదు" అని మరో యూజర్ వెల్లడించాడు.
'మీరు ఆ రిఫండ్ డబ్బులతో వడా పావ్ తినవచ్చు' అని ఓ యూజర్ జోక్ చేశాడు.