NANNA: నాన్నకు ప్రేమతో.... హెలికాప్టర్ నుంచి డబ్బుల వర్షం
డెట్రాయిట్లో ఆసక్తికర ఘటన;
తల్లిదండ్రులు బతికుండగానే పట్టించుకోని పిల్లలున్న నేటి సమాజంలో తండ్రి చనిపోయిన తర్వాత కూడా ఆయన కోరిక కొడుకులు తీర్చారు. అయితే ఇది తండ్రి కోరిక అయినప్పటికీ వీరి తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డెట్రాయిట్కి చెందిన 58 ఏళ్ల డారెల్ ప్లాంట్ థామస్ తన అంత్యక్రియల సమయంలో పేద ప్రజలకు డబ్బు సాయం చేయాలనేది అతడి కోరిక. దీనివల్ల సమాజం తనను చిరకాలం గుర్తించుకోవాలని ఆశించేవాడు. ఆయితే గత నెల జూన్ 27న థామస్ కన్నుమూశారు. దీంతో తండ్రి కోరికను నెరవేర్చాలని అతడి కొడుకులు డేరెల్, జోంటే హెలికాప్టర్ ఏర్పాటు చేసి గులాబి పూలతో పాటు సుమారు రూ. 4 లక్షల పైన నగదును ఆకాశం నుంచి వర్షంలా కురిపించారు.
దీంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడి ట్రాఫిక్ స్థంభించిపోయింది. రోడ్లపైనే పాదాచారులు, వాహనదారులు నగదును తీసుకోవడానికి ఎగబడ్డారు. ఈ విషయం స్థానికుల ద్వారా పోలీసుల దృష్టికి వెళ్లటంతో నగదు, గులాబి పూరేకులు పడిన దారిని పోలీసులు మూసేశారు. వీరు చేసిన పనితో పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది దాతృత్వంలా లేదని... ఇది సరైన విధానం కాదని మండిపడ్డారు. అలాగే యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఈ ఘటనపై సీరియస్గా దర్యాప్తు చేస్తోంది. వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావటంతో డేరెల్, జోంటే ప్రేమపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. డబ్బుల కోసం తల్లిదండ్రులను దూరం పెడుతున్న నేటి సమాజంలో తండ్రి కోరిక మేరిక లక్షలు ఖర్చు చేసిన వీరిని పలువురు ప్రశంసిస్తున్నారు. కాకపోతే తండ్రి కోరిక తీర్చటం సబబే కానీ విధానం సరైనది కాదన్నారు.