Jammu & Kashmir : జమ్మూ కశ్మీర్‌లో ప్రకృతి విలయం..రాంబన్‌లో ముగ్గురు మృతి..
జమ్మూకశ్మీర్ రాష్ట్రం భారీ వర్షాలు, ఆకస్మిక వరదలతో అతలాకుతలమవుతోంది. శనివారం ఉదయం రాంబన్ జిల్లాలోని రాజ్‌గఢ్ తహసీల్‌లో కురిసిన కుంభవృష్టి పెను విషాదం మిగిల్చింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు గల్లంతయ్యారు.రాజ్‌గఢ్‌లో అనూహ్యంగా వచ్చిన ఆకస్మిక వరదలు పలు గ్రామాలను ముంచెత్తాయి. వరద ప్రవాహానికి అనేక ఇళ్లు తీవ్రంగా దెబ్బతినగా, కొన్ని పూర్తిగా కొట్టుకుపోయాయి. సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టాయి. ఇప్పటివరకు మూడు మృతదేహాలను వెలికితీశారు. గల్లంతైన ఐదుగురి కోసం గాలింపు ముమ్మరంగా కొనసాగుతోంది.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, ఆకస్మిక వరదల తో జమ్మూలోని పలు జిల్లాలు తీవ్రంగా నష్టపోయాయి. అధికారిక నివేదికల ప్రకారం.. ఇప్పటివరకు 36 మందికి పైగా మరణించినట్లు తెలుస్తోంది. వరద ప్రభావం కొనసాగనున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.