ఓ రాష్ట్రానికి సీఎం అంటే వాళ్ళ షెడ్యూల్ ఎలా ఉంటుంది. క్షణం తీరిక లేకుండా ఉరుకులు పరుగులు పెడుతుంటారు. అధికారులతో మీటింగ్ లు, సమావేశాలు, సంక్షేమ పథకాల రివ్యూ లు, పార్టీ వ్యవహారాలు ... అబ్బో కనీసం తినడానికి కూడ ఒక్కోసారి టైం ఉండని పరిస్థితి. కానీ ఓ సీఎం మాత్రం కాసేపు ఈ వ్యవహారాలు పక్కన పెట్టి తనకు ఇష్టమైన రైతు అవతారం ఎత్తాడు...
ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ఓ కొత్త పాత్రలో కనిపించారు. కాడెద్దులతో సంప్రదాయ పద్ధతిలో పొలం దున్ని అందరినీ ఆశ్చర్యపరిచారు. స్థానిక రైతులతో కలిసి వరి నాట్లువేశారు.
తన సొంత పొలంలో సంప్రదాయ పద్ధతిలో వ్యవసాయ పనులు చేపట్టిన సీఎం ధామి నాగలి పట్టి దుక్కి దున్నారు. అనంతరం అక్కడున్న స్థానిక రైతులతో కలిసిపోయి ఉత్సాహంగా వరి నాట్లు వేశారు. ఇంకేముంది సీఎం పొలం పనులు చేసే వీడియోలు నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి. సూపర్ సీఎం అంటూ ఆ వీడియో లను మరింత వైరల్ చేస్తున్నారు నేటిజెన్లు.
కాగా ప్రస్తుతం ఉత్తరాఖండ్ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వ్యవసాయ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. రైతులంతా వరి నాట్లు వేసే పనుల్లో నిమగ్నమయ్యారు. ఇదే సమయంలో రైతులకు భరోసా కల్పిస్తూ వారిలో ఒకరిగా సీఎం ధామి పొలం పనుల్లో పాల్గొనడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే, మరోవైపు రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతుండటం, వరదలు సంభవించడం ఆందోళన కలిగిస్తోంది.