ఆలయంలో దొంగ.. చోరీ చేసే ముందు దేవునికి మొక్కి..
చేసేది తప్పని తెలుసు.. అయినా కష్టపడకుండా డబ్బులు వస్తున్నాయని ఆశపడ్డాడు..;
చేసేది తప్పని తెలుసు.. అయినా కష్టపడకుండా డబ్బులు వస్తున్నాయని ఆశపడ్డాడు.. వెనకా, ముందూ ఎవరైనా చూస్తున్నారేమో అని పరికించాడు.. కానీ తాను చేసే తప్పు పని దేవుడు ఓ కంట కనిపెడుతూనే ఉంటాడని భావించాడేమో క్షమించమని వేడుకున్నాడు.. భక్తులు కానుకగా ఇచ్చిన నగదును జేబులో పెట్టుకున్నాడు. ఇదంతా సీసీటీవీలో రికార్డయింది.
రాజస్థాన్‌లోని అల్వార్‌కు చెందిన ఓ వ్యక్తి ఆలయంలోకి చొరబడి ప్రార్థనలు చేస్తూ డబ్బు, ఇతర విలువైన వస్తువులను దొంగిలించడం సీసీటీవీలో చిక్కింది. ఆ వ్యక్తిని గోపేష్ శర్మ (37)గా గుర్తించారు. అతడు దేవాలయాలను మాత్రమే టార్గెట్ గా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతుంటాడని పోలీసులు విచారణలో తెలుసుకున్నారు.
శనివారం ఉదయం తీసిన CCTV ఫుటేజీలో శర్మ అల్వార్‌లోని ఆదర్శ్ నగర్ ప్రాంతంలోని ఒక ఆలయంలో ప్రార్థనలు చేసి చివరికి విరాళం పెట్టె నుండి డబ్బు తీసుకుని జేబులో పెట్టుకున్నాడు. ఆలయంలోని తాళం పగులగొట్టి వెండి ఆభరణాలు, గొడుగులు, కానుక పెట్టెలోని డబ్బులు, ఇతర వస్తువులను అపహరించాడు.
అల్వార్‌లోని ఫ్రెండ్స్ కాలనీలో ఉన్న మరొక ఆలయంలో ఇదే విధమైన సంఘటన జరిగింది. అక్కడ కూడా ఇదే వ్యక్తి ప్రార్థనలు చేసిన తర్వాత వస్తువులను దొంగిలిస్తున్నట్లు సీసీటీవీలో పట్టుబడ్డాడు. దొంగతనానికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో, సీసీటీవీ ఫుటేజీ ద్వారా గుర్తించిన పోలీసులు గోపేష్ శర్మను అరెస్టు చేశారు. విచారణలో తాను పలు ఆలయాల్లో ఇలాంటి చోరీలకు పాల్పడినట్లు అంగీకరించాడు.
గోపేష్ శర్మ కేవలం దేవాలయాలను మాత్రమే టార్గెట్ చేస్తున్నాడని పోలీసులు ఆ తర్వాత గుర్తించారు. అతను ఆలయాలను పరిశీలించి, పూజారి వెళ్లిన తర్వాత, విలువైన వస్తువులను దొంగిలిస్తుంటాడు. ప్రస్తుతం అతని పాత రికార్డుల కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు. వారి విచారణలో ఇతర సంఘటనలు కూడా వెల్లడవుతాయని భావిస్తున్నారు.