US: అమెరికా పాఠశాలలో కాల్పులు.. ఇద్దరు చిన్నారుల మృతి..
సంఘటనాస్థలిలో దుండగుడు ఆత్మహత్య;
అమెరికాలో మరోసారి తుపాకీ కాల్పులతో దద్దరిల్లింది. ఓ దుండగుడు తుపాకీతో చెలరేగిపోయాడు. కేథలిక్ పాఠశాల విద్యార్థులే లక్ష్యంగా కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో 8, 10 వయసు గల ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. అనంతరం దుండగుడు తనకు తానుగా కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాల్పులకు పాల్పడిన వ్యక్తి రాబిన్ వెస్ట్‌మన్‌గా గుర్తించారు.
ఎఫ్‌బీఐ ప్రకారం.. మిన్నియాపాలిస్‌లోని అనౌన్సియేషన్ కాథలిక్ స్కూల్‌లో దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడని తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోగా.. 17 మంది చిన్నారులు గాయపడ్డారని పేర్కొంది. అనంతరం దుండగుడు ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పింది. ఇది దేశీయ ఉగ్రవాద చర్య అని.. అంతేకాకుండా ద్వేషపూరిత నేరంగా ఎఫ్‌బీఐ పేర్కొంది. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతున్నట్లుగా స్పష్టం చేసింది. కేథలిక్కులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగినట్లుగా ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ అభిప్రాయపడ్డారు.
పాఠశాలలో ప్రార్థన కోసం పిల్లలంతా హాజరైనప్పుడు కాథలిక్ చర్చి కిటికీలోంచి దుండగుడు తుపాకీతో కాల్పులు జరిపినట్లుగా పోలీసులు గుర్తించారు. ఇది పూర్తిగా అర్థం చేసుకోలేనిదిగా ఉందని మిన్నియాపాలిస్ పోలీస్ చీఫ్ మీడియాతో అన్నారు.