Sundar Pichai : సుందర్ పిచాయ్‌కు గూగుల్ బంపర్ ఆఫర్.. రూ.6,400 కోట్ల శాలరీ ప్యాకేజీతో రికార్డు.

Update: 2026-03-07 07:45 GMT

Sundar Pichai : టెక్ దిగ్గజం గూగుల్ (ఆల్ఫాబెట్) తన సీఈఓ సుందర్ పిచాయ్‌పై కాసుల వర్షం కురిపించింది. ఆయన పనితీరుకు మెచ్చిన కంపెనీ, రాబోయే మూడేళ్ల కోసం ఏకంగా 692 మిలియన్ డాలర్ల (సుమారు రూ.6,400 కోట్లు) భారీ శాలరీ ప్యాకేజీని ప్రకటించింది. దీంతో ప్రపంచంలోనే అత్యధిక వేతనం అందుకుంటున్న సీఈఓలలో ఒకరిగా పిచాయ్ నిలవనున్నారు. కేవలం నగదు రూపంలోనే కాకుండా, కంపెనీ షేర్ల రూపంలో ఈ భారీ ప్యాకేజీని గూగుల్ సిద్ధం చేసింది.

శాలరీ ప్యాకేజీలో ఏముందంటే?

పిచాయ్‌కు అందే ఈ 6,400 కోట్ల రూపాయల్లో మెజారిటీ భాగం పర్ఫార్మెన్స్ స్టాక్ యూనిట్ల(PSUs) రూపంలో ఉంటుంది. అంటే, కంపెనీ స్టాక్ మార్కెట్‌లో ఎంత బాగా రాణిస్తే ఆయనకు అంత ఎక్కువ లాభం చేకూరుతుంది. ఒకవేళ ఆల్ఫాబెట్ షేర్లు ఎస్‌ అండ్ పీ 100 ఇండెక్స్‌లోని ఇతర కంపెనీల కంటే మెరుగ్గా ఉంటే, ఆయనకు అందే మొత్తం రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. అలా జరిగితే పిచాయ్ ఖాతాలో భారీగా షేర్లు చేరతాయి. ఒకవేళ కంపెనీ పెర్ఫార్మెన్స్ తగ్గితే మాత్రం ఈ షేర్లు దక్కవు. ఇవే కాకుండా, ఏడాదికి 2 మిలియన్ డాలర్ల మూల వేతనం, ప్రతినెల అందే రిస్ట్రిక్టెడ్ స్టాక్స్ అదనం.

వేమో, వింగ్ ప్రాజెక్టుల నుంచీ వాటా!

గూగుల్ తన భవిష్యత్తు ప్రాజెక్టులైన వేమో (సెల్ఫ్ డ్రైవింగ్ టాక్సీ), వింగ్ (డ్రోన్ డెలివరీ)ల బాధ్యతలను కూడా పిచాయ్‌కే అప్పగించింది. ఈ రెండు విభాగాల వృద్ధికి అనుగుణంగా ఆయనకు సుమారు 350 మిలియన్ డాలర్ల విలువైన స్టాక్ ఇన్సెంటివ్‌లను కొత్తగా జోడించింది. అటానమస్ డ్రైవింగ్, డెలివరీ రంగాల్లో వస్తున్న సవాళ్లను పిచాయ్ సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారని, అందుకే ఆయనకు మరిన్ని ప్రోత్సాహకాలు అందించడం కంపెనీ వాటాదారులకు మేలు చేస్తుందని ఆల్ఫాబెట్ బోర్డు అభిప్రాయపడింది.

పిచాయ్ హయాంలో గూగుల్ ప్రస్థానం

2015లో సుందర్ పిచాయ్ సీఈఓగా బాధ్యతలు చేపట్టినప్పుడు గూగుల్ మార్కెట్ విలువ 535 బిలియన్ డాలర్లు. కానీ నేడు అది ఏడు రెట్లు పెరిగి ఏకంగా 3.6 ట్రిలియన్ డాలర్లకు చేరింది. మధ్యలో ఏఐ రేసులో గూగుల్ వెనుకబడిందన్న విమర్శలు వచ్చినా, ఛాట్ జీపీటీకి ధీటుగా లేటెస్ట్ ఏఐ మోడల్స్‌ను ప్రవేశపెట్టి పిచాయ్ గూగుల్‌ను మళ్లీ ట్రాక్‌లోకి తెచ్చారు. అలాగే గూగుల్ ఎదుర్కొంటున్న పలు యాంటీ ట్రస్ట్ కేసులను కూడా ఆయన చాకచక్యంగా డీల్ చేస్తున్నారు.

టెక్ దిగ్గజాల ఆదాయం ఎంత?

పిచాయ్ సంపాదన ఇతర టెక్ సీఈఓలతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంది. ఉదాహరణకు, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల 2025 ఆర్థిక సంవత్సరంలో 96.5 మిలియన్ డాలర్లు సంపాదించగా, యాపిల్ బాస్ టిమ్ కుక్ 74.3 మిలియన్ డాలర్లు పొందారు. పిచాయ్ దంపతుల వద్ద ప్రస్తుతం గూగుల్‌కు చెందిన 1.67 మిలియన్ షేర్లు ఉన్నాయి, వీటి విలువ దాదాపు 498 మిలియన్ డాలర్లు. ప్రపంచ టెక్ రంగంలో భారతీయ ప్రతిభకు సుందర్ పిచాయ్ ఒక తిరుగులేని ఉదాహరణగా నిలుస్తున్నారు.

Tags:    

Similar News