Crude Oil : 30 నెలల గరిష్టానికి ముడి చమురు ధరలు..పెట్రోల్, డీజిల్ ధరల బాదుడు తప్పదా ?
Crude Oil : అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు సామాన్యుడి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్నాయి. ముఖ్యంగా ఇరాన్ నిబంధనలకు తలొగ్గి లొంగిపోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించడంతో మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. దీని ప్రభావం నేరుగా చమురు ధరలపై పడింది. గడిచిన 30 నెలల్లో ఎన్నడూ లేనంతగా బ్రెంట్ క్రూడ్, డబ్ల్యూటీఐ ధరలు 90 డాలర్ల మార్కును దాటేసి 100 డాలర్ల దిశగా పరుగులు తీస్తున్నాయి. కేవలం ఈ మార్చి నెలలోనే చమురు ధరలు 30 శాతానికి పైగా పెరగడం గమనార్హం.
మంట పుట్టిస్తున్న గ్యాస్ సిలిండర్ ధరలు
అంతర్జాతీయంగా చమురు సెగలు ఇప్పటికే మన వంటింట్లోకి ప్రవేశించాయి. మార్చి 7 (నేడు) నుండే పెట్రోలియం కంపెనీలు గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరను భారీగా పెంచేశాయి. దీంతో ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.900 దాటేసింది. మరోవైపు కమర్షియల్ సిలిండర్ ధర 2023 తర్వాత మొదటిసారిగా రూ.2,000 మార్కును దాటి రికార్డు సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే క్రూడ్ ఆయిల్ లో 20 శాతం వాటా ఉండే హోర్ముజ్ జలసంధి మూతపడటంతో సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ఇది త్వరలో తెరుచుకునే సూచనలు లేకపోవడంతో మున్ముందు ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.
దేశీయ మార్కెట్‌లో రికార్డు స్థాయికి ధరలు
భారతదేశంలోని మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో ముడి చమురు ధరలు గతంలో ఎన్నడూ లేని విధంగా బ్యారెల్‌కు రూ.8,500 మార్కును దాటాయి. ఇది ఆల్-టైమ్ రికార్డ్ అని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరో రెండు వారాల పాటు ఇలాగే కొనసాగితే, దేశీయ మార్కెట్‌లో బ్యారెల్ ధర రూ.10,000 కు చేరుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని హెచ్చరిస్తున్నారు. చమురు ధరలు పెరగడం వల్ల రవాణా ఖర్చులు పెరిగి, నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఆకాశాన్ని తాకే ప్రమాదం ఉంది.
పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా?
గ్యాస్ ధరలు పెరగడంతో ఇప్పుడు అందరి దృష్టి పెట్రోల్, డీజిల్ ధరలపై పడింది. ముడి చమురు 100 డాలర్లు దాటితే మన దేశంలో లీటర్ పెట్రోల్ ధర భారీగా పెరిగే అవకాశం ఉంది. అయితే, కేంద్ర ప్రభుత్వం సామాన్యులపై భారం పడకుండా ఉండేందుకు రష్యా నుండి తక్కువ ధరకే క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. రష్యా నుండి సరఫరా పెరిగితే పెట్రోల్ ధరలు స్థిరంగా ఉండే అవకాశం ఉంది. పెట్రోలియం శాఖ మంత్రి మరియు ప్రభుత్వం ప్రస్తుత పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నారు.