Spain Train Accident : స్పెయిన్‌లో రెండు హైస్పీడ్ రైళ్లు ఢీ..
21 మంది మృతి.. వంద మందికి పైగా గాయాలు
స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. కోర్డోబా ప్రావిన్స్‌లోని అడముజ్ ప్రాంతంలో రెండు హైస్పీడ్ రైళ్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో సుమారు 21 మంది మృతి చెందారు. మరో 100 మందికిపైగా గాయపడ్డారు. వీరిలో 25 మంది పరిస్థితి విషమంగా ఉంది.
మాడ్రిడ్ నుంచి హువెల్యాకు వెళ్తున్న రెన్ఫే రైలును.. మాలాగా నుంచి మాడ్రిడ్‌కు వెళ్తున్న ఇర్యో హైస్పీడ్ రైలు ఢీకొట్టినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఆదివారం సాయంత్రం 6.40 గంటలు ( స్థానిక కాలమానప్రకారం) ఈ ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నారు. ఇర్వో రైలు పట్టాలు తప్పి ప్క ట్రాక్‌లోకి దూసుకెళ్లడంతో ఎదురుగా వస్తున్న రెన్ఫే రైలును ఢీకొట్టింది. ఈ తీవ్రతకు రెన్ఫె రైలు ముందుభాగంలోని రెండు బోగీలు పట్టాలు తప్పి.. నాలుగు మీటర్ల లోతైన గోతిలో పడిపోయాయని చెప్పారు. ప్రమాద సమయంలో ఇర్యో రైలులో 300 మందికిపైగా ఉండగా.. రెన్ఫే రైలులో సుమారు 100 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న సైనిక, అగ్నిమాపక దళాలు, అత్యవసర సేవల విభాగాలు రంగంలోకి దిగాయి. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉండవచ్చని అధికారులు తెలిపారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండవచ్చని భావిస్తున్నారు.
రైలు ప్రమాదంపై స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. కాగా, ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని స్పెయిన్ రవాణా శాఖ మంత్రి ఆస్కర్ పుయెంటె తెలిపారు. నేరుగా ఉన్న ట్రాక్‌పై ప్రమాదం జరగడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు. ప్రమాద నేపథ్యంలో మాడ్రిడ్ – ఆండలూసియా మధ్య రైలు సర్వీసులను నిలిపివేశారు.